హైకోర్టు ఆదేశించినప్పటికీ వైకాపా ఎమ్మెల్యే రోజాని శాసనసభ సమావేశాలలో పాల్గొనేందుకు అనుమతించకపోవడంతో వైకాపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తెదేపా నేతలు కూడా ధీటుగానే జవాబిస్తున్నారు. ఒక తెలుగు టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, వైకాపా ఎమ్మెల్యే పార్ధ సారధి మధ్యదీనిపై ఆసక్తికరమయిన వాగ్వాదం జరిగింది.
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, వైకాపా ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటం రెడ్డి తదితరులు వయసులో, అనుభవంలో కూడా తమ కంటే చాలా పెద్దవారయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పట్ల అనుచితంగా మాట్లాడటం తప్పు. ప్రజా సమస్యల గురించి చర్చిస్తున్నప్పుడు వాటికే పరిమితం కావాలి తప్ప ఆ సాకుతో వ్యక్తిగత విమర్శలు చేయడం తప్పు,” అని ప్రభాకర్ చౌదరి వాదించారు.
దానికి పార్థ సారధి జవాబు చెపుతూ “సభలో తెదేపా సభ్యులు, మంత్రులుతమ అధినేత జగన్ పట్ల, తమ పట్ల అనుచితంగా మాట్లాడటం తప్పు కాదా? మా మాటలని తప్పు పడుతున్న మీకు సభలో మీ పార్టీ సభ్యులు ఏవిధంగా మాట్లాడారో తెలియదా?” అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు సంతృప్తికరమయిన సమాధానాలు చెప్పుకోలేకనే అధికార పార్టీ సభ్యులు తమపై ఎదురుదాడి చేస్తూ, తమ ప్రశ్నలకు జవాబు చెప్పకుండా తప్పించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రోజా విషయంలో తీర్పు చెప్పేందుకు హైకోర్టు అధికారం లేదని భావిస్తున్నప్పుడు, మళ్ళీ అదే హైకోర్టులో ఎందుకు సవాలు చేసారని ప్రశ్నించారు. న్యాయస్థానాల కంటే తామే ఎక్కువని భావిస్తునప్పుడు హైకోర్టు తీర్పును పట్టించుకోకుండా ఉండవలసిందని పార్ధ సారధి అన్నారు. “తెలంగాణాలో తెదేపా ఎమ్మెల్యేలు తెరాస పార్టీలో చేరితే అన్యాయం, అక్రమం అని తెదేపా అక్రోశిస్తుంది కానీ ఆంధ్రాలో తెదేపాయే ఆ అన్యాయానికి, అక్రమాలకి పాల్పడుటోంది. తెదేపాకి అక్కడో న్యాయం..ఇక్కడో నయ్యం అమలుచేస్తోంది,” అని విమర్శించారు.
శాసనసభలో అనుచితంగా వ్యవహరిస్తున్నవైకాపా ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటం రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనేందుకు గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన సభా హక్కుల కమీటీ మూడుసార్లు నోటీసులు పంపినప్పటికీ ఆమె ఏవో కుంటి సాకులు చెపుతూ హాజరుకాలేదని ప్రభాకర్ చౌదరి అన్నారు. దానికి పార్ధసారధి జవాబిస్తూ “హైకోర్టు ఆదేశాలనే పట్టించుకోనప్పుడు, సభా హక్కుల కమిటీలో ఆమెకు న్యాయం జరుగుతుందని మేము భావించలేదు. ఆ కమిటీ ఎటువంటి నివేదిక ఇవ్వబోతోందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అయినా రోజాగారు నిన్న ధర్నాలో సొమ్మసిల్లిపడిపోవడంతో నీమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకొంటున్నారు. కమిటీ ముందు హాజరయిన మా సభ్యులు అదే విషయం వారికి తెలియజేసి, నీమ్స్ ఆసుపత్రి ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ ని కూడా అందజేశారు కదా?” అని ప్రశ్నించారు. పార్ధ సారధి చెప్పిన జవాబులో ఆమె కమిటీ ముందు హాజరయినా ఫలితం ఉండదు గాబట్టే హాజరుకాలేదన్నట్లు ఉంది తప్ప అనారోగ్య కారణాల వలన అన్నట్లుగా లేదు.