ఆంధ్రప్రదేశ్ లో తెదేపా, వైకాపాల మధ్య మొదలయిన యుద్ధం ఈరోజు సాక్షి మీడియా కొందరు మంత్రుల భూబాగోతాలను బయటపెట్టడంతో తీవ్ర స్థాయికి చేరుకొంది. తెదేపా ప్రభుత్వాన్ని పడగొడతానంటూ జగన్మోహన్ రెడ్డే మొదట ఈ యుద్ధభేరి మ్రోగించినప్పటికీ, తెదేపా ప్రయోగించిన ‘ఆకర్ష అస్త్రాని’కి ఆయన ఎదురు నిలవలేకపోయారు. రోజుకొకరు ఇద్దరు చొప్పున వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలోకి వెళ్లిపోతుంటే దానికి అడ్డు కట్టవేయడానికే జగన్ తన వద్ద దాచిన ఈ ‘భూ బ్రహ్మాస్త్రాన్ని’ బయటకు తీసి తెదేపాపై ప్రయోగించారు. ఆ దెబ్బకి గురయిన తెదేపా మంత్రులు, ఎంపిలు విలవిలలాడిపోయారు. సాక్షి చేసిన ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు పుల్లారావు, నారాయణ తదితరులు, తమపై లేనిపోని అభాండాలు వేస్తున్న సాక్షిని కోర్టు కీడ్చుతామని హెచ్చరించడం గమనిస్తే జగన్ సంధించిన ఆ భూ బ్రహ్మాస్త్రాన్ని నిలువరించేందుకు వారి వద్ద బలమయిన ఆయుధాలు లేవని స్పష్టమయింది. వారందరూ అక్రమాలకు పాల్పడినట్లుగా తన వద్ద బలమయిన ఆధారాలు ఉన్నాయని సాక్షి మీడియా నమ్మకంగా చెపుతున్నప్పుడు, వారు సాక్షి మీడియాని కోర్టుకి ఈడిస్తే దాని వలన నష్టపోయేది వారే. కానీ ఈ వ్యవహారంలో మౌనం వహించినా సాక్షి చేసిన ఆరోపణలు నిజమేనని దృవీకరించినట్లవుతుంది.
ఈ భూబాగోతంలో సాక్షాత్ ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ కూడా ఉన్నాడని సాక్షి ఆరోపించింది కనుక దాని చేతిలో చాలా బలమయిన ఆధారాలుండబట్టే అంత సాహసానికి పూనుకొందని భావించవచ్చును. గత వారం రోజులుగా వైకాపాతో చెలగాటం ఆడుకొంటున్న తెదేపా సాక్షి చేసిన ఈ తీవ్ర ఆరోపణలతో ఆత్మరక్షణలో పడినట్లయింది. ముఖ్యమంత్రి కొడుకుతో సహా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానపాత్ర పోషిస్తున్న మంత్రులు అందరిపై సాక్షి చాలా తీవ్రమయిన ఆరోపణలు చేయడంతో ఇప్పుడు రెండు పార్టీలు కూడా పద్మవ్యూహంలో చిక్కుకుపోయాయని చెప్పవచ్చును.
ఈ ఆరోపణల కారణంగా ఇప్పుడు వైకాపా కూడా ఇక వెనకడుగు వేయాలని స్థితికి చేరుకొంది. తెదేపా కూడా దీనిపై తాడోపేడో తేల్చుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. కనుక ఈ పద్మవ్యూహం నుండి రెండు పార్టీలు మళ్ళీ ఎలాగ బయటపడుతాయో చూడాలి. ఈ సమస్యకు మూలకారణం వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలోకి తీసుకుపోవడమే కనుక ఆ విషయంలో తెదేపా వెనక్కి తగ్గినట్లయితే వైకాపా కూడా వెనక్కి తగ్గవచ్చును.
కానీ సాక్షి చేసిన ఈ తీవ్రమయిన ఆరోపణలు, ఆ మీడియాలో రాజధాని భూబాగోతాలు గురించి వరుసగా ప్రచురితమవుతున్న కధనాలు తెదేపా ప్రతిష్టకి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకి చాలా నష్టం కలిగించడం తధ్యం. ఇంతవరకు రాజధాని భూముల విషయంలో ‘ఆల్ ఈజ్ వెల్’ అనుకొంటున్న రాష్ట్ర ప్రజలకి ఇది చాలా పెద్ద షాక్ అనే చెప్పవచ్చును. భూముల విషయంలోనే ఇంత బారీ స్థాయిలో అక్రమాలు జరిగితే రేపు లక్షల కోట్లు ఖర్చు చేసి రాజధాని నిర్మాణం మొదలుపెడితే అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతాయో అనే సందేహం కలగడం సహజం. కనుక సాక్షి చేస్తున్న ఈ ఆరోపణలన్నిటినీ వాటిని ఎదుర్కొంటున్న తెదేపా మంత్రులు, ఎంపిలు, నేతలు పెద్ద గొంతుతో ఖండించి సరిపెట్టకుండా న్యాయస్థానంలో తమ నిర్దోషిత్వాన్ని తప్పనిసరిగా నిరూపించుకొంటే వారికే అన్ని విధాల మంచిది. లేకుంటే ఆ ఆరోపణలు నిజమని అంగీకరించినట్లవుతుంది.
అకస్మాత్తుగా ఈ భూబాగోతాన్ని బయటపెట్టి జగన్మోహన్ రెడ్డి తెదేపా నేతలను బాగానే దెబ్బ తీసారు కానీ ఇంత బారీ ఎత్తున అవినీతి జరుగుతోందని తెలిసినప్పుడు వెంటనే దానిని ప్రజల దృష్టికి తీసుకు వెళ్ళకుండా ఈ విషయాన్ని ఇంత కాలం ఎందుకు దాచిపెట్టారనే ప్రశ్నకు ఆయన జవాబు చెప్పవలసి ఉంటుంది.