రోజా సస్పెన్షన్ విషయంలో తెదేపా, వైకాపాలు రెండూ కూడా వరుస తప్పులు చేస్తున్నాయని చెప్పక తప్పదు. ఆమెను సస్పెండ్ చేసేందుకు సభకు అధికారం ఉన్నపటికీ, ప్రస్తుత సమావేశాల కాలానికి మాత్రమే సస్పెండ్ చేయడానికి వినియోగించవలసిన రూల్ 340 నిబంధనను ఏడాది పాటు సస్పెండ్ చేయడానికి ఉపయోగించడం పొరపాటు. హైకోర్టు తన తీర్పులో అదే విషయం పేర్కొంటూ ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేసింది. తెదేపా చేసిన సాంకేతికమయిన ఈ పొరపాటు కారణంగానే దానికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అది అర్ధమయినప్పుడు, హైకోర్టు అదేశాన్ని గౌరవించి ఆమెను సభలోకి అనుమతించడం ద్వారా ఆ పొరపాటును సరిదిద్దుకొనే అవకాశం ఉంది. కానీ ఆమెను సభలోకి అనుమతిస్తే అది తమ ఓటమిగా భావించినందున పంతానికిపోయి సమస్యను ఇంకా జటిలం చేసుకొంది. అది చేసిన ఈ రెండవ తప్పు వలన న్యాయవ్యవస్థకి, శాసనసభకి మధ్య యుద్ద వాతావరణం ఏర్పడింది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీలాగ మాత్రమే ఆలోచించి, వ్యవహరించడం చాలా తప్పు. దాని రాజకీయ కక్షలు, సమస్యల కారణంగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడటాన్ని ఎవరూ హర్షించలేరు.
రోజా సస్పెన్షన్ విషయంలో రాజకీయ మైలేజీ పొందాలని వైకాపామొదటి నుంచి కూడా ప్రయత్నిస్తూనే ఉందనేది నిష్టుర సత్యం. ఆమెను సభ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి నేటి వరకు ఆమె, వైకాపా వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది. ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయించుకొనే కంటే, ఈ విధంగా దానిపై రభస చేస్తుండటం వలననే మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షించగలము. తెదేపా ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేక భావనలు సృష్టించగలము. తద్వారా దాని ప్రతిష్టని దెబ్బ తీయవచ్చుననే ఉద్దేశ్యంతోనే వైకాపా ఈ డ్రామాని రక్తి కట్టిస్తోందని చెప్పక తప్పదు. హైకోర్టు తీర్పు కాపీని పట్టుకొని వరుసగా రెండు రోజులు శాసనసభకు వచ్చి చాలా హడావుడి చేసిన రోజా, శాసనసభ హక్కుల కమిటీ ముందు హాజరు కావలసి వచ్చినప్పుడు మాత్రం ఆరోగ్యం బాగోలేదంటూ ఆసుపత్రిలో చేరిపోవడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చును.ఆమె కూడా కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటం రెడ్డిలతో బాటు నిన్న శాసనసభ హక్కుల కమిటీ ముందు హాజరయ్యి, సంజాయిషీ, క్షమాపణలు చెప్పుకొని తనపై సస్పెన్షన్ ఎత్తివేయించుకొనే (చివరి) అవకాశం ఉన్నప్పటికీ ఉద్దేశ్యపూర్వకంగానే ఆ అవకాశాన్ని జారవిడుచుకోవడం గమనిస్తే, ఆమెకు తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయించుకోవాలనే ఉద్దేశ్యం ఏమాత్రం లేదని అర్ధమవుతోంది. వైకాపా యొక్క ఈ వ్యూహం లేదా దాని ఉద్దేశ్యం ఇంత స్పష్టంగా కనబడుతున్నప్పుడు, తెదేపా దానిని అర్ధం చేసుకోలేకనే ఈవిధంగా తప్పటడుగులు వేస్తోందనుకోవాలా లేకపోతే పంతానికిపోయి తప్పటడుగులు వేస్తోందనుకోవాలా? ఈవిషయంలో రెండు పార్టీలు కూడా వరుసపెట్టి చాలా తప్పులు చేస్తున్నాయని చెప్పక తప్పదు. తప్పులు చేయడం కంటే అది తప్పు అని తెలిసీ కూడా సరిదిద్దుకోకుండా ఇంకా తప్పులు చేస్తుండటం పెద్ద తప్పు. అవి చేసే తప్పుల కారణంగా రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తే అప్పుడు ప్రజలు ఆ రెండు పార్టీలని కూడా క్షమించరని గ్రహిస్తే వాటికే మంచిది.