రాజకీయాలలో ఉన్నవారు ఎంత అనుభవజ్ఞులయినా కూడా ఏదో ఒకప్పుడు తప్పులు చేయడమో లేక నోరు జారి ఇబ్బందులలో పడటం సర్వసాధారణ విషయమే. అయితే సుమారు పదేళ్ళుగా రాజకీయాలలో ఉంటునప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇంకా తప్పటడుగులు వేస్తూనే ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. భూమానాగిరెడ్డి వ్యహారంలో ఆ విషయం మరొకమారు స్పష్టం అయ్యింది.
చంద్రబాబు నాయుడుని ద్వేషించడం, తిట్టడమే తన పార్టీ పాలసీగా చేసుకొని ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి, ఆయనకి చిన్న జలక్ ఇవ్వాలనుకొన్నారు. తెలుగు దేశం పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్చులో ఉన్నారని, తను తలుచుకొంటే అర్ధగంటలో ప్రభుత్వాన్ని కూల్చి వేయగలనని జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకొన్నారు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుని, ఆయన ప్రభుత్వాన్ని, విధానాలను అన్నిటినీ చాలా అసహ్యించుకొంటూ ఉండవచ్చును. కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని కూల్చి వేయగలనని గొప్పగా చెప్పుకోవడం చాలా తప్పు.
ఆయన ఏదో నోరు జారి ఆ మాట అన్నాడని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఇదివరకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చి వేస్తానని ఇలాగే బెదిరించేవారు. చివరికి అన్నంతపనీ చేసారు కూడా కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు చక్రం అడ్డం వేయడంతో విఫలమయ్యాడు. కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని కూల్చి వేస్తానని ఉద్దేశ్యపూర్వకంగా అన్నదేనని స్పష్టమవుతోంది.
జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిపోవాలని చాలా కోరిక ఉండవచ్చును. కానీ దానిని నెరవేర్చుకొనేందుకు ఇది సరయిన పద్ధతి కాదు. తన అత్యుత్సాహం, దుందుడుకుతనం వలన చివరికి స్వంత పార్టీలోనే చిచ్చు రగిలించుకొని దానిని ఆర్పుకోవడానికి నానా అవస్థలు పడుతుంటే ప్రజలు, రాజకీయ వర్గాలలో వారు అతనిని చూసి నవ్వుకొంటున్నారు.
చంద్రబాబు నాయుడి పరిపాలనలో లోపాలు, అవినీతి ఉండవచ్చును కానీ అంతమాత్రాన్న తను చంద్రబాబు నాయుడుని భయపెట్టగలనని లేదా దెబ్బతీయగలనని జగన్మోహన్ రెడ్డి భ్రమిస్తే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు. అది హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్లు ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేయడం వలననే చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా ధీటుగా స్పందించవలసి వచ్చింది. ఆయన ఒకే ఒక చిన్న ఎత్తువేసి భూమానాగిరెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేసారు. భూమానాగిరెడ్డి తెదేపాలో చేరుతారా లేదా..అనేది వేరే విషయం, కానీ చంద్రబాబు నాయుడు వేసిన అ చిన్న ఎత్తుకి జగన్మోహన్ రెడ్డి ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇదంతా దేనివలన వచ్చింది అంటే తన నోటి దురద వలననే అని చెప్పక తప్పదు.
చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం ముందు జగన్ వ్యూహాలు పనిచేయవని మరొకమారు స్పష్టమయిపోయింది. పైగా ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి చావు తప్పి కన్ను లొట్టపోయినంత పని అయింది. కనుక ఇకనయినా ఆయన ఇటువంటి మాటలు, సవాళ్లు, వ్యూహాలకు దూరంగా ఉంటే మంచిది.