ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఏదో ఒక అంశంపై చర్చను చేపట్టడం, ఆ తరువాత దానిపై చర్చను పక్కనపెట్టి ఒకరినొకరు దూషించుకొంటారని అందరూ ఊహించిందే. అదే నేడు కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంపై వైకాపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగవలసి ఉండగా, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల గురించి, అతనిపై ఉన్న హత్య కేసుల గురించి, తుని విద్వంసంలో అతని ప్రమేయం గురించి అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు. గజరాజు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయని జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ సభ్యులను కుక్కలతో పోల్చడం, వంగవీటి రంగా హత్య కేసు, దాని గురించి హరిరామజోగయ్య వ్రాసిన పుస్తకం గురించి మాట్లాడారు. వీటికి అవిశ్వాస తీర్మానానికి ఏవిధమైన సంబంధం లేదని అందరికీ తెలుసు.
తెదేపా ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసినందున దానిపై ప్రజలు నమ్మకం కోల్పాయారు కనుకనే తమ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టమని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొనప్పుడు, ఆ హామీల గురించి, ప్రజా సమస్యల గురించి ఈ సందర్భంగా శాసనసభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి ఉంటే ఆయన పెట్టిన తీర్మానం వీగిపోయినా, దాని ఉద్దేశ్యం నెరవేరినట్లుండేది. కానీ అది నెరవేరలేదు సరికదా దాని అసలు ఉద్దేశ్యం తెదేపాలో చేరిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చేయడానికేనని జగన్ స్వయంగా నిసిగ్గుగా సభలో చెప్పుకొన్నారు. సభలో అధికార ప్రతిపక్ష సభ్యులందరూ తాము ప్రజలందరూ తమవైపే ఉన్నట్లుగా లేదా తాము మాత్రమే ప్రజల పక్షాన్న నిలబడి వారి శ్రేయసు కోసమే మాట్లాడుతున్నట్లుగా ప్రజలను భ్రమింపజేసేందుకు ప్రయత్నించారు. కానీ వాస్తవానికి వారందరూ కలిసి శాసనసభ ప్రతిష్టను మంట గలిపారని చెప్పక తప్పదు.