టీడీపీ జాబితా చూసి.. అభ్యర్థుల్ని ప్రకటిద్దామని వైసీపీ.. వైసీపీ అభ్యర్థుల్ని చూసి.. తమ జాబితా ప్రకటించాలని వైసీపీ ఎదురు చూస్తోంది. ఈ రెండు పార్టీల జాబితాలను చూసి… టిక్కెట్లు దక్కని వారు.. తమ దగ్గరకు వస్తారని జనసేన నేతలు ఎదురు చూస్తున్నారు. ఇక బీజేపీకి ఎలాంటి ఆశలు లేవు. ఆ పార్టీ పోటీ చేసినా పట్టించుకునేవారు లేరు. అందుకే.. మూడు పార్టీలు ఎప్పుడు.. జాబితా విడుదల చేస్తాయా అని ఎదురు చూస్తున్నారు. కసరత్తు మాత్రం దాదాపుగా పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ దాదాపుగా 125 నియోజకవర్గాలలో అభ్యర్ధుల జాబితాను సిద్దం చేసింది. అనధికారికంగా చెప్పేసింది. కానీ అధికారిక ప్రకటన మాత్రం లేదు. అనధికారికంగా మాత్రం పత్రికల్లో, ప్రసార మాద్యమాల్లో వచ్చేసింది. వైసిపికి అభ్యర్ధులను కూడా చూసుకుని జాబితాను విడుదల చేస్తే బాగుంటుందని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నప్పటికీ, ఈ నెల 14వ తేదిన మంచి ముహూర్తం ఉందని, ఆ రోజు జాబితా ప్రకటిస్తామని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. కానీ అసలు విషయం మాత్రం వైసీపీ జాబితాను చూసి ప్రకటిద్దామని అనుకుంటున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లను ప్రశాంత్ కిషోర్ టీం ఖరారు చేస్తోంది. తెలగుదేశం పార్టీ నుంచి వలసలు ఎక్కువ కావడం, కొంతమంది వ్యాపారులు కూడా ఆ పార్టీలో చేరడంతో వారందరికీ అభ్యర్ధిత్వాలను ఇవ్వాల్సి వస్తోంది. ఇప్పటికే పార్టీలో ఉన్న ఇన్ ఛార్జ్ లు , ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ప్రచారాన్ని ప్రారంభించలేదు. ఎవరి స్థానం ఎప్పుడు మారుతుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. పైగా, అధికార పార్టీలో సీటు దక్కని వారు, తాము కోరుకున్న స్థానం లభించని నేతలు, అసంతృప్తి వాదులు వైసిపిలోకి వలసలు ప్రారంభించారు. వీరందరినీ సర్ధుబాటు చేయడం లోటస్ పాండ్ లో వ్యూహకర్తలకు తలకు మించిన భారంగా మారింది. పైగా, అభ్యర్ధుల పై సర్వే, ఎంపిక అంతా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అభ్యర్దుల ఎంపిక కార్యక్రామాన్ని చేపట్టడంతో వైసిపి సీనియర్ నేతలంతా సైలెంట్ అయిపోయారు. జగన్ కూడా ఆయనపైనే ఆధారపడటం, వలసలు కూడా ఆయన ద్వారానే జరుగుతుండటంతో వైసిపిలో.. సీనియర్ నేతలెవరికీ.. కనీస బాధ్యతలు లేకుండా పోయాయి. తెలుగుదేశం జాబితా విడుదల అయితే అక్కడ అసంతృప్తి వాదులంతా తమ వైపుకు వస్తారని వైసిపి ఎదురుచూస్తుంది. ఇందుకోసమే టిడిపి జాబితా విడుదల కోసం వైసిపి అధినేత జగన్ ఎదురుచూస్తున్నారు. కొన్ని స్థానాల్లో వైసీపీకి అభ్యర్దులు దొరకకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది.
జనసేన పార్టీ నేతలు సిపిఐ. సిపియం నేతలతో పొత్తు చర్చలు జరుపుతున్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో జాబితాను ప్రకటిస్తామని అంటున్నారు. 175 నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు అనేక దరఖాస్తులు వచ్చాయని అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో కూడా క్లారిటీ లేదు. తెలుగుదేశం, వైసిపి మాత్రం ఒకరి జాబితా కోసం మరొకరు ఎదురుచూస్తున్నారు.