ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆఖరి పూర్తి బడ్జెట్లో ఆంధ్ర ప్రదేశ్‌కు శూన్య హస్తమే చూపించడంతో టిడిపి మాత్రమే గాక వైసీపీ కూడా ఇరకాటంలో
పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి అనీ మరొకటి అనీ షరా మామూలుగా మీడియా కథనాలు వచ్చేశాయి. కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, ఎంపిలు కూడా పెదవి విరిచారు. ఆ విధంగా తాము కూడా సంతోషంగా లేమనే సంకేతాలిచ్చారు. ఆదివారం ఏదో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు బిల్డప్ మొదలెట్టారు గాని చివరకు ఇదేమీ జరగదని ముందే చెప్పొచ్చు. వైసీపీ ఎంపిలు కూడా అసంతృప్తి స్వరాలు వినిపించినా టిడిపికి వచ్చినంత ప్రచారం రాదు.జగన్ మాట్లాడరు గనక అంత ప్రాధాన్యతా లభించదు. శుక్రవారం కేసుకోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఏమైనా స్పందిస్తారేమో తెలియదు. ఏమైనా ప్రత్యేక హౌదా ఇస్తే మద్దతిస్తాం అన్న జగన్ మాట ఇప్పుడు తేలిపోయింది. దీనిపై రాజీనామాలు చేస్తారా అని టిడిపి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి సవాలు విసరడం కూడా హాస్యాస్పదంగానే వుంది.మరోవైపున బిజెపి ఎంపి హరిబాబు బడ్జెట్‌వల్ల నష్టం లేదని చెప్పడం అసత్యాన్ని మింగించే అనవసర ప్రయాస మాత్రమే. ఏది ఏమైనా మరికొన్ని రోజులు ఈ మూడు పార్టీల రాజకీయ విన్యాసాలు చూడక తప్పదు.
తెలంగాణ ఎంపి కవిత కొన్ని విమర్శనా వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆర్థిక మంత్రి రాజేందర్ మాత్రం పెద్దగా మాట్లాడ్డానికి సిద్ధం కాలేదు. అంటే టిఆర్ఎస్ కూడా సుతిమెత్తగా పోనివ్వాలని నిర్ణయించుకుందన్నమాట. పాలక పక్షాలు సర్దుకోవచ్చు గాని పాలితుతైన ప్రజలు మాత్రం జరిగిన అన్యాయానికి ఆగ్రహిస్తున్న మాట నిజం.