రోజుకొకరు ఇద్దరు చొప్పున వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరిపోతుంటే తెదేపా ఏదో ఘనకార్యం సాధించినట్లు ఫీలయిపోతుంటే, వైకాపా తన మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందేమోనని భయాందోళనలో ఉంది. అయితే ఇల్లలకగానే పండుగ కాదన్నట్లు ఒకేసారి ప్రత్యర్ధ పార్టీకి చెందిన అంతమంది ఎమ్మెల్యేలను తెదేపాలో ఇముడ్చుకోలేక, వారు కూడా ఇమడలేక ఇబ్బందులు, ఘర్షణలు పడుతుండటం కనిపిస్తూనే ఉంది. అయినా వైకాపాని రాష్ట్రం నుంచి తుడిచిపెట్టేయాలనే పట్టుదలగా ఉన్న తెదేపా ఆ పార్టీలో ఎమ్మెల్యేలందరినీ పార్టీలోకి రప్పించాలని తెగ ఉబలాటపడుతోంది. డజను మంది చేరితేనే తట్టుకోలేకపోతునప్పుడు ఇంకా మరో నాలుగు డజన్ల మందిని పార్టీలోకి తీసుకువస్తే ఏమవుతుంది? మున్ముందు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని తెదేపా ఆలోచిస్తున్నట్లు లేదు. రాష్ట్రంలో అనేక జిల్లాలలో తెదేపా నేతల మధ్యనే అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వారికి వైకాపా ఎమ్మెల్యేలు కూడా తోడయితే? ఈ అంతర్గత కలహాల కారణంగా తెదేపా బలహీనపడితే దాని పరిస్థితి వైకాపా కంటే దయనీయంగా మారే ప్రమాదం ఉంటుంది.
ఈ కలహాలు, పదవులు, టికెట్లు వంటి కారణాల చేత తెదేపా నేతలకి, తెదేపాలోకి కొత్తగా వచ్చి చేరుతున్న వారికీ కూడా అసంతృప్తి ఏర్పడటం సహజం. వచ్చే ఎన్నికలనాటికి ఈ అసంతృప్తి పూర్తిగా బయటపడవచ్చును. పార్టీలో టికెట్లు దొరకనివారు, వేర్వేరు కారణాల చేత పార్టీపై అసంతృప్తిగా ఉన్నవారు వేరే పార్టీలలోకి వెళ్లిపోవడం మొదలయితే, ఇప్పుడు తెదేపా ఏ ఉద్దేశ్యంతో వైకాపా ఎమ్మెల్యేలని రప్పిస్తోందో ఆ ప్రయోజనం నెరవేరకపోగా, ఆ కారణంగానే పార్టీ దెబ్బయిపోయే ప్రమాదం ఉంటుంది.
వచ్చే ఎన్నికల నాటికి తెదేపా-బీజేపీలు విడిపోయినట్లయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో సరికొత్త రాజకీయ సమీకరణాలు, వాతావరణం ఏర్పడుతుంది. వాటి వలన వచ్చే ఎన్నికలలో వేరే పార్టీ లేదా కూటమికి విజయావకాశాలున్నట్లు అనిపిస్తే తెదేపాలో అసంతృప్తిగా ఉన్నవారు మూటాముల్లె సర్దుకొని వెళ్లిపోవచ్చును. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో వైకాపా లేకుండా చేయడం అసాధ్యం. ఒకవేళ సాధ్యమయినా కూడా తెదేపా పట్ల అసంతృప్తి చెందినవారికి వేరే కొత్త మార్గాలు తెరుచుకొనే అవకాశాలుంటాయి కనుక చివరికి తెదేపాయే నష్టపోవచ్చును. కనుక వైకాపా ఎమ్మెల్యేలని చేర్చుకొని రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసి మళ్ళీ అధికారం నిలబెట్టుకోవాలనే అప్రజాస్వామిక ఆలోచనలు, ప్రయత్నాలు మానుకొని పార్టీని అంతర్గతంగా బలపరచుకొంటూ, ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయడానికి గట్టిగా కృషి చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.