తెలంగాణలో కరోనా కారణంగా పాఠశాలలు ప్రారంభించలేదు. చాలా కాలంగా ఉపాధ్యాయులు ఖాళీగానే ఉన్నారు. ఇలాంటి సమయంలో గ్రేటర్ ఎన్నికలు వచ్చాయి. దీంతో పనులు ఉండే ఇతర శాఖల వారిని పక్కన పెట్టి ఎన్నికల విధులకు ఉపాధ్యాయుల్నే ఎక్కువగా ఉపయోగించుకుటారని అనుకున్నారు. సాధారణంగా ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులే కీలకం., కాస్త ఎక్కువగా అవగాహన ఉండేది వారికే. అందుకే వారికి కీలక బాధ్యతలు ఇస్తూ ఉంటారు. అనూహ్యంగా ఈ సారి ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్నప్పటికీ.. వారికి విధులు కేటాయించకూడదని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు నిర్వహిస్తున్న సిబ్బంది పాత్ర మరింత క్రియాశీలకంగా ఉంటుంది. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని… అందుకే వారికి విధులు అప్పగించడం మంచిది కాదన్న ఆలోచన.. అధికార పార్టీలో వచ్చిందని చెబుతున్నారు. అందుకే వారిని.. దూరంగా ఉంచాలని నిర్ణయించారని చెబుతున్నారు. ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా తెర ముందుకు వస్తున్నారు. తమకు ఎందుకు ఎన్నికల విధులు కేటాయించలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
వాస్తవానికి ఉపాధ్యాయులకే బోధనేతర పనులు చెప్పకూడదని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. అసలు బోధన పనే ఉండటం లేదు. వేరు పనులు కూడా లేకపోతే.. తమకు ఇబ్బంది అనుకున్నారేమో కానీ.,. ఎన్నికల విధులు నిర్వహించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం.. వారితో పని చేయించుకోవడానికి సిద్ధంగా లేదు.