గురుపూజోత్సవం రోజున ప్రభుత్వం గౌరవంగా చేపట్టే కార్యక్రమాలకు వెళ్లకూడదని ఏపీ టీచర్లు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దాదాపుగా అన్ని టీచర్ ఉద్యోగ సంఘాలు నిర్ణయాన్ని ప్రకటించాయి. కొన్ని రోజులుగా టీచర్లు ప్రభుత్వ వేధింపులకు గురవుతున్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి .. పదవిలోకి వచ్చిన జగన్ దాన్ని అమలు చేయకపోగా…తమపై సంఘ విద్రోహశక్తుల ముద్ర వేస్తున్నారని వారు ఆగ్రహంతో ఉన్నారు. వారు ఉద్యమిస్తున్నారన్న కారణంగా ప్రభుత్వం మరింతగా అణిచివేత చర్యలకు పాల్పడుతోంది.
ఫేస్ యాప్ పేరుతో అటెండెన్స్ ను తొమ్మిది గంటల కల్లా చేసుకోకపోతే ఆబ్సెంట్ వేస్తామని ప్రకటించింది. ఇక తమకు రావాల్సిన బెనిఫిట్స్..ఇతర విషయాల్లోనూ ఒత్తిడికి గురి చేస్తోంది. ప్రభుతవ వేధింపుల వల్ల ఇటీవల కొంత మంది ఉపాధ్యాయులు మనోవేదనతో చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో టీచర్లు.. ప్రభుత్వం గురుపూజోత్సవం పేరుతో ఇచ్చే ఎలాంటి గౌరవాన్ని స్వీకరించకూడదని నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వాలపై ఉపాధ్యాయులు.. ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయడం సహజమే అయినా… ఎప్పుడూ ప్రభుత్వ గౌరవాల్ని కాదనుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం మరీ దారుణంగా వ్యవహరిస్తోందని టీచర్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే వద్దనుకుంటున్నారు. గురువుల్ని పూజిస్తామంటే వద్దని పారిపోతున్న స్థాయిలో ఈ ప్రభుత్వ పాలన ఉందని విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.