తెలుగుదేశం పార్టీ హయాంలో టీచర్ పోస్టుల భర్తీ కోసం రెండు డీఎస్సీలు వేశారు. కనీసం పాతిక వేల పోస్టులను భర్తీ చేశారు. టీచర్ ఉద్యోగాలను ఇచ్చారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చాలా తేలికగా మాట్లాడేవారు. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ వేస్తామనేవారు. యాభై వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. భర్తీ చేస్తామని ప్రకటించేవారు. ఆయన అధికారంలోకి వచ్చారు. నాలుగేళ్లవుతోంది. ఈ నాలుగేళ్లలో ఎంతో మంది టీచర్లు రిటైరయ్యారు. కానీ కొత్తగా ఒక్క టీచర్నంటే.. ఒక్క టీచర్ని కూడా నియమించలేదు. మెగా డీఎస్సీ కాదు కదా… చిన్న డీఎస్సీ కూడా వేయలేదు.
ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో 50, 677 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని లెక్క తేలింది. ఇది ఏపీ ప్రభుత్వం చెప్పలేదు. అసలు స్కూళ్లలో ఎంత మంది విద్యార్థులు చేరారు.. ఎంత మంది డ్రాపవుట్ అయ్యారో కూడా సీక్రెట్ గా ఉంచుకునే ప్రభుత్వం ఇది. అలాంటిది టీచర్ ఖాళీలు ఎన్ని ఉన్నాయో చెబుతుందా.. చాన్సే లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేరుగా పార్లమెంట్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 50, 677 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నా భర్తీ చేయడం లేదని తెలిపింది.
ఇంత పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే.. ఇక విద్యార్థులకు పాఠాలు ఎలా చెబుతారు..? విద్యా ప్రమాణాలు ఎలా ఉంటాయో అంచనా వేయడం పెద్ద విషయమేం కాదు. కానీ ఘనత వహించిన ఏపీ సర్కార్.. ముఖ్యమంత్రి జగన్.. తాను ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ వేసి.. కనీసం కొన్ని పోస్టులు అయినా భర్తీ చేయకుండా.. స్కూళ్లను విలీనం చేసి టైంపాస్ చేస్తున్నారు. హామీని తుంగలో తొక్కి.. .. మాట తప్పను.. మడమ తిప్పను అంటూ… రూ. కోట్ల ప్రజాధనం పెట్టి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు.