ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో పోరాటపటిమకు ప్రతిరూపంగా కనిపించిన టీమిండియా.. మూడో టెస్టులో దానికి పూర్తి రివర్స్‌లో కనిపించింది. ఏ దశలోనూ కనీసం పోరాడే ప్రయత్నం చేయకుండా దారుణంగా పరాజయం పాలైంది. మూడో టెస్టు నాలుగో రోజు ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. మూడో రోజు కాస్త పోరాడినట్లుగా కనిపించినా… నాలుగో రోజు కూడా తేలిపోయారు.
తొలి రోజే ఇండియా ఓటమి ఖరారైంది. అయితే అద్భుతం జరగకపోతుందా అని అని అనుకున్నారు. కానీ ప్రతీ సారి అద్భుతాలు జరగవని నిరూపించేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే బ్యాట్లెత్తేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్ నీరసం చూసి బౌలర్లు కూడా అంతే అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లను కట్టడి చేయలేకపోయారు. ఫలితంగా 432 పరుగుల భారీ స్కోరు ఇంగ్లాండ్ చేసింది. ఇక టీమిండియాకు ఉన్న ఒకే ఒక్క చాయిస్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోకుండా ఉండటం. ఇంకా కష్టపడితే ఎలాగోలా డ్రా చేసుకోవడం. కానీ అవి జరిగినా అద్భుతాలే. కానీ మూడో రోజు కాస్త పుజారా, రోహిత్ శర్మ, కోహ్లీ కొద్దిగా పోరాడినట్లుగా కనిపించడంతో ఆశలు చిగురించాయి.
కానీ నాలుగో రోజు మళ్లీ మొదటి రోజు ఆటనే రిపీట్ చేశారు. వరుసుగా పెవిలియన్ బాట పట్టారు. రవీంద్ర జడేజా మాత్రమే 30 పరుగులు చేసి కాస్త పరువు నిలిపే ప్రయత్నం చేశాడు. చివరికి 278 పరుగులకు ఆలౌంటైంది. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది. నాలుగో రోజు ఎనిమిది వికెట్లు మొదటి సెషన్లోనే పడిపోయాయి. ఇంగ్లాండ్ బౌలర్లలో రాబిన్సన్ ఐదు వికెట్లు తీయగా ఓవర్టన్ మూడు తీశాడు. అలాగే అండర్సన్, మొయిన్ అలీ చెరో వికెట్ సాధించారు.
లీడ్స్‌లో పిచ్ సమస్య కాదని ఇంగ్లాండ్ ఆటగాళ్ల బ్యాటింగ్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇండియా బ్యాట్స్ మెన్ నిర్లక్ష్యంతో ఔటైన విధానం ..పిచ్ సమస్య కాదని… భయమేనని సులువుగా అర్థం చేసుకోవచ్చు. రెండో టెస్టు నుంచి బోలెడంత ఆత్మవిశ్వాసం వచ్చి ఉంటుందేమో కానీ ఈ టెస్టుతో మాత్రం మరింత నీరసాన్ని టీమిండియా సభ్యులు తెచ్చుకుని ఉంటారు. బౌలర్ రాబిన్సన్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.