గుజరాత్ లో వెలుగు చూసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోంజీ స్కామ్ టీం ఇండియా శిభిరంలో కలకం రేపింది. బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి రూ.6 వేల కోట్లను సేకరించిన బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ ఝలాను ఇప్పటికే గుజరాత్ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసు విచారణలో గుజరాత్ సిఐడి క్రైమ్ బ్రాంచ్ సమన్లు పంపే అవకాశం ఉన్న వారిలో టీం ఇండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లలో గిల్‌తో పాటు, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలని సిఐడి అధికారులు విచారణకు పిలిచే అవకాశం వుంది.
తమ సంస్థ ద్వారా బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తామని గుజరాత్‌లోని పలు ప్రాంతాల ప్రజలను భూపేంద్ర సింగ్ నమ్మించారు. కొద్దికాలం తర్వాత సంస్థ పనితీరుపై అనుమానం రావడంతో కొందరు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు సంస్థకు చెందిన 10 మందికి పైగా ఏజెంట్లను అరెస్ట్ చేశారు.
గిల్ ఈ పథకంలో రూ. 1.95 కోట్లు పెట్టుబడి పెట్టగా, మోహిత్ శర్మ, తెవాటియా, సాయి సుదర్శన్ చిన్నమొత్తంలో పెట్టుబడులు పెట్టారని నివేదికలు వచ్చాయి. గిల్ ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో వున్నాడు. టూర్ ముగిసిన తర్వాత గిల్ తో పాటు మిగతా క్రికెటర్స్ ని విచారణకు పిలిచే అవకాశం వుంది. ఈ స్కామ్ విచారణలో ఆటగాళ్ల సహకారం చాలా కీలకం కానుందని, వారు ఇచ్చే సమాచారం ప్రకారం కేసులో మరింత పురోగతి చోటుచేసుకుంటుందని అధికారులు చెబుతున్నారు.