సాంకేతిక లోపం కారణంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ) లో ట్రేడింగ్ బుధవారం ఆగిపోయింది. స్పాట్ నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ సూచికలు అటూ ఇటూ కదలడం హఠాత్తుగా ఆగిపోయింది. నిమిషాలు దాటి గంటలు గడుస్తున్నా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తిరిగి మొదలు కాకపోవడంతో ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ లో ఇవాళ ఉదయం కలకలం మొదలైంది. వివరాల్లోకి వెళితే..
భారతదేశంలో స్టాక్ ట్రేడింగ్ ప్రధానంగా బీఎస్ఈ మరియు ఎన్ ఎస్ఈ ల లో జరుగుతుంది. ప్రతి రోజు వేల కోట్లు అటు ఇటు ట్రేడింగ్ లో చేతులు మారుతూ ఉంటాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి చెందిన సెన్సెక్స్ ప్రస్తుతం 50 వేల వద్ద కొనసాగుతూ ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి చెందిన నిఫ్టీ సుమారు 15 వేల వద్ద కొనసాగుతోంది. అయితే ఈ రోజు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏర్పడ్డ సాంకేతిక లోపం కారణంగా కారణంగా నగదు మరియు ఫ్యూచర్ మార్కెట్లు రెండూ ప్రభావితమయ్యాయి. ప్రత్యేకించి రేపు ఈ నెల ఆఖరి గురువారం కావడం , అది ఫ్యూచర్ కాంట్రాక్టులకు డెడ్ లైన్ కావడం తో, కీలకమైన సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆగిపోవడం ట్రేడర్ల కి ముచ్చెమటలు పట్టించింది. ట్రేడింగ్ ఆగిపోయిన వెంటనే, వ్యాపారులలో భయాందోళనలు వ్యాపించాయి మరియు సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ వచ్చాయి.
అయితే దీనిపై స్పందించిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ , వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించడానికి ఒక బృందం కృషి చేస్తున్నట్లు తెలియజేసింది. ఈ విషయంపై ఎన్ఎస్ఇ ఇండియా మాట్లాడుతూ “వీలైనంత త్వరగా వ్యవస్థలను పునరుద్ధరించడానికి మేము కృషి చేస్తున్నాము. అన్ని విభాగాలు 11:40 వద్ద మూసివేయబడ్డాయి, సమస్య పరిష్కరించబడిన వెంటనే పునరుద్ధరించ బడతాయి ” అని పేర్కొంది. అయితే ఇలా సాంకేతిక కారణాలతో ట్రేడింగ్ ఆగిపోవడం అప్పుడప్పుడు జరిగేదే అని, గతంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మాత్రమే కాకుండా యూఎస్ కి చెందిన నాస్డాక్ లో కూడా సాంకేతిక కారణాలతో ట్రేడింగ్ ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
ఏది ఏమైనా, సాంకేతిక లోపం వల్ల ఎన్ఎస్ఈ ట్రేడింగ్ ఆగిపోవడం అన్నది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, తమ ఐటి వ్యవస్థలను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు.