టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరి.. అక్కడ్నుంచి మళ్లీ కాంగ్రెస్ చేరిక బాధితుడిగా మారిన హైదరాబాద్ మాజీ మేయర్.. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పుడు వేరే దారి చూసుకునే పనిలో ఉన్నారు. తనపై గెలిచిన సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉన్నారు. తామెకు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు తన పరిస్థితేమిటని ఆయన ఆలోచిస్తున్నారు. ఈ లోపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్ సంకేతాలు రావడంతో ఆయన గొంతు విప్పడం ప్రారంభించారు. సబితా ఇంద్రారెడ్డిపై తీవ్ర ఆరోపణలు ప్రారంభించారు. ఇప్పటికే మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
టీఆర్ఎస్లో అసంతృప్తి వాదులు త్వర త్వరగా బయటకు వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చాన్స్ దొరకదు అన్నవారు ఇంకా ఎక్కువ ఉక్కపోతకు గురవుతున్నారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం వరుసగా ఒకరి తర్వాత ఒకర్ని చేర్చుకుంటూ పోతున్నారు. ప్రత్యేకంగా ఓ టీమ్‌ను పెట్టుకుని పార్టీలో చేరే వారి కోసం చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నేతలపై గురి పెట్టారు. ముందుగా ఎమ్మెల్యేలపైనే ఒత్తిడి తెస్తున్నారు.
తిరిగి సొంత గూటికి వస్తారా లేకపోతే ప్రత్యర్థుల్ని చేర్చుకుని టిక్కెట్ ఇవ్వమంటారా అన్న రీతిలో సందేశాలు పంపుతున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్లో ఉక్కపోతుకు గురవుతున్న వారితోనూ సంప్రదిస్తున్నారు. ఎక్కువ మంది పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అలాంటి వారిలో తీగల కృష్ణారెడ్డి ఒకరన్న చర్చ జరుగుతోంది., వరుసగా చేరికలతో కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు ఉందని నిరూపించే దిశలో రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు హైకమాండ్ కూడా మద్దతు పలుకుతోంది.