తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మెల్లగా చేరికల జోరు పెరిగేలా ఉంది. ఢిల్లీ వెళ్లే హడావుడిలో ఉన్న చంద్రబాబును మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి , మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కలిశారు. సమావేశం అయిపోయిన తర్వాత తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీలో చేరుతున్నానని ప్రకటించారు. టీడీపీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని ప్రకటించారు. మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి మాత్రం ఏమీ మాట్లాడలేదు. వీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే మీడియా ప్రతినిధులకు మాత్రం తమ ఇంట్లో జరగబోయే వివాహానికి హాజరు కావాలని చంద్రబాబును కోరామన్నారు.
తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కొంత మంది నేతలు ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థిుల్లో ఉన్నారు. తీగల కృష్ణారెడ్డి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా తర్వాత బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అయితే తర్వాత సబితా ఇంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకుని తీగలను పక్కన పెట్టేశారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరాలని రేవంత్ ఆహ్వానించినా ఎందుకో పెద్దగా ఆసక్తి చూపించలేదు. మళ్లీ బీఆర్ఎస్ గెలుస్తుందేమో అనుకున్నారేమో కానీ సైలెంట్ అయిపోయారు.
తెలుగుదేశం పార్టీపై దృష్టి పెట్టాలని చంద్రబాబు అనుకుంటున్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల నాటికి సిటీలో అయినా బలం పుంజుకోవాలని అనుకుంటున్నారు ఇందు కోసం పాత క్యాడర్ ను మళ్లీ యాక్టివ్ చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రయత్నాలు ఎంత వరకు వర్కవుట్ అవుతాయో కానీ.. ఇప్పటి వరకూ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడ్ని నియమించలేదు. మల్లారెడ్డి పేరు కూడా పలుమార్లు ప్రచారంలోకి వచ్చింది.