తీన్మార్ మల్లన్న బిఆర్ఎస్ పార్టీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన అసెంబ్లీలో కేటీార్, హరీష్ రావులతో సమావేశమయ్యారు. గతంలో జరిగిన రాజకీయాల కారణంగా మల్లన్నతో భేటీకి వీరు ఆసక్తి చూపించకూడదు కానీ.. పిలిచి కూర్చోబెట్టి చాలా సేపు మాట్లాడారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లన్నను సస్పెండ్ చేశారు. బీసీ కులగణనపై మల్లన్న చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ బాగానే ఉపయోగించుకుంది. బీసీ కులగణనకు చట్టబద్దత కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో దర్నా చేస్తామని బీఆర్ఎస్ తరపున మద్దతివ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది.
తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆయన ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశానికి బీఆర్ఎస్ కు చెందిన కొంత మంది సహకారం అందించారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతకు ముందు బీఆర్ఎస్ పార్టీపై తీన్మార్ మల్లన్న ఓ రేంజ్ లో పోరాటం చేశారు. ఆయన యూట్యూబ్ చానల్ పై ఎన్ని సార్లు బీఆర్ఎస్ నేతలు దాడులు చేశారో చెప్పడం కష్టం. తీన్మార్ మల్లన్న కూడా చాలా రోజుల్లో జైల్లో ఉండాల్సి వచ్చింది. చివరికి బీజేపీ సాయంతో బెయిల్ తెచ్చుకున్నారు
అయితే ఏ పార్టీలో చేరినా సరే నిలకడగా ఉండని తీన్మార్ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా..తనను బయటకు గెంటేసే వరకూ పోరాడారు. ఇప్పుడు బీఆర్ఎస్ తో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన ఆసక్తి చూపినా బీఆర్ఎస్ లో చేర్చుకునేంత సాహసం చేయరన్న వాదన వినిపిస్తోంది. తీన్మార్ మల్లన్న సొంత పార్టీ ప్రణాళికాల్లో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.