తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ ఇప్పుడు… తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. దీనికి కారణం నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగి… టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వడమే. పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యా సంస్థల అధినేత. ఆయన తన నెట్ వర్క్‌ను ఉపయోగించుకుని పట్టభద్రుల ఓట్లను పెద్ద ఎత్తున ఎన్రోల్ చేయించారు. పకడ్బందీగా పోల్ చేయించుకోగలిగారు. కానీ తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ మాత్రం.. తన పోరాటాన్నే నమ్ముకున్నారు.
టీవీ5లో వచ్చే ఓ సెటైరిక్ ప్రోగ్రాం ద్వారా తీన్మార్ మల్లన్న అనే పేరు తెచ్చుకున్న నవీన్.. సొంతంగా క్యూ న్యూస్ అనే యూట్యూబ్ చానల్ నడుపుతూ.. పాపులర్ అయ్యారు. టీఆర్ఎస్పై విరుచుకుపడటంతో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆయనపై ప్రభుత్వం అనేక కేసులు బనాయించినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. రాజకీయంగా ఎదగాలనే ఆకాంక్ష ఉన్న ఆయన తరచూ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటారు. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అయితే కనీస ప్రభావం కూడా చూపించలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి.. అనూహ్యంగా రెండో స్థానంలో ఉన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెమటలు పట్టించారు.
ఉద్యమ నేతగా అందరి ప్రశంసలు పొందిన కోదండరాం ను మూడో స్థానానికి పరిమితం చేశారు. తీన్మార్ మల్లన్న ఏ పార్టీలోనూ లేరు. స్వతత్రంగానే పోటీ చేస్తూ ఉంటారు. ఏ పార్టీలో లేకపోయినా.. ఒంటరిగా పోరాడుతూ.. తనదైన ముద్ర వేశారు. ఇటీవల బీజేపీ నేతలతో కాస్త సన్నిహితంగా ఉంటూ వస్తున్న ఆయన .. టీఆర్ఎస్ను గద్దె దించే లక్ష్యంతో ఆ పార్టీలో చేరినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్న చర్చ జరుగుతోంది.