కాంగ్రెస్ విజయోత్సవాలకు తనను పిలవలేదని.. తన పేరు కూడా ఆహ్వానపత్రికలో లేదని తీన్మార్ మల్లన్న ఆవేదన చెందుతున్నారు.కానీ ఆయన టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్సీని చేసిన కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న రాజకీయం చూస్తే ఎవరైనా దగ్గరకు రానిస్తారా?. కులగణన దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ ఆయన రేవంత్ ను.. కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గాన్ని దూషిస్తూ..తాను బీసీల చాంపియన్ ను అని సభలు పెట్టుకుంటున్నారు. కాబోయే ముఖ్యమంత్రిని అన్నట్లుగా కూడా ప్రసంగాలు చేస్తున్నారు. మరి అలాంటప్పుడు విజయోత్సవాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పిలిస్తే ఎంత.. పిలవకపోతే ఎంత ?
తీన్మార్ మల్లన్న రాజకీయ జీవితం మొదటి నుంచి అంతే ఉంది. బీఆర్ఎస్ హయాంలో ఆయన చేసిన రాజకీయాకు.. తిట్లకు ఎన్ని సార్లు దాడులకు గురయ్యారో చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ వీడియోల్లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటంతో పాటు అందర్నీ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తారన్న ఆరోపణలతో చాలా రోజులు జైల్లో ఉన్నారు. చివరికి బీజేపీలో చేరే ఒప్పందంతో బెయిల్ తెచ్చుకున్నారు. తర్వాత ఆ పార్టీలో కూడా ఉండ లేదు. కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్సీ అయి ఇపుడు ఆ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు.
బీసీ నినాదంతో ముఖ్యమంత్రి అయిపోవాలని ఇటీవలి కాలంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందుకే ఇతర వర్గాల్ని దూషిస్తున్నారు. నల్లగొండజిల్లాలో రెడ్డి సామాజికవర్గం నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయన రాజకీయాలు ఎంత వరకు వర్కవుట్ అవుతాయో కానీ ఆయనను నమ్మేందుకు ఒక్క రాజకీయ నాయకుడు కూడా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది.