కరుణాకరన్ అంటే లవ్ స్టోరీస్. తొలి ప్రేమ నుంచీ.. ఆయన దారి అదే. మధ్యలో కొన్ని విచిత్రమైన ప్రయత్నాలు చేశారు. అవన్నీ బెడసి కొట్టేశాయి. ఓ కంప్లీట్ లవ్ స్టోరీ చెప్పినప్పుడు మాత్రం మంచి ఆదరణ లభించింది. అందుకే ఈసారి పూర్తి స్థాయి ప్రేమకథతో వస్తున్నారు. అదే తేజ్ ఐ లవ్ యూ. సాయిధరమ్ తేజ్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రమిది. జులై మొదటి వారంలో విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది. కరుణాకరన్ మార్క్‌లోనే.. లవ్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్‌తో.. సాగిందీ ట్రైలర్. ‘అమ్మాయిల్ని పడగొట్టేయడం ఎలా?’ అనే విషయంలో కథానాయకుడికి ఓ థీరీ ఉంటుంది. దాన్ని అమలు చేస్తాడు. పోయి పోయి కమీషనర్ కూతురు వెంట పడతాడు. దాంతో ప్లాన్ రివర్స్ అవుతుంది. కమీషనర్ కూతురు నందు… తేజ్‌తో ఆడుకోవడం మొదలెడుతుంది. ఆ ప్రయాణంలో ఇద్దరి మధ్య లవ్ పుడుతుంది. మధ్యలో విడిపోతారు.. మళ్లీ కలుసుకుంటారు. ఇదీ స్టోరీ. ట్రైలర్లోనే కథ మొత్తం గుమ్మరించేశాడు కరుణాకరన్. అయితే ఫన్ బాగా పండినట్టు అర్థమవుతోంది. కరుణాకరణ్ మరోసారి తన బలాలపై ఫోకస్ పెట్టాడు. ఫొటోగ్రఫీ నీట్‌గా ఉంది. తెరంతా రంగుల హరివిల్లులా కనిపిస్తోంది. కామెడీ, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయితే.. ‘తేజ్’ అందరికీ నచ్చే ఛాన్సుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.