తేజ సినిమాలు చూడండి. అన్నీ.. తక్కువ బడ్జెట్లో రూపొందినవే. అప్పట్లో చిత్రం.. అయితే.. 30 లక్షల్లో తీసిన సినిమా. తేజ సినిమాలు ఫ్లాప్ అవ్వొచ్చు. కానీ మేకింగ్‌లో ఆయన ఫెయిల్ కాలేదు. ఆయనతో సినిమాలు తీసి నిర్మాతలు భారీగా నష్టపోయిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఆయన బడ్జెట్ ఎప్పుడూ కంట్రోల్ లోనే ఉంటుంది. నేనే రాజు – నేనే మంత్రి సినిమాకి రూ.15 కోట్లు అయ్యింది. ఆయన కెరీర్లో తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా అదే. అయితే కొడుకు సినిమా కోసం మాత్రం తేజ భారీగా ఖర్చు పెడుతున్నారని టాక్.
తేజ తనయుడు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. `విక్రమాదిత్య` పేరుతో తేజ వారసుడి ఎంట్రీ జరగబోతోంది. దీనికి తేజనే దర్శకుడు. ఈ సినిమాకి రూ.30 కోట్ల బడ్జెట్ అని తెలుస్తోంది. తేజ కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రమిదే. తనయుడు కదా అని.. రూ.30 కోట్లు ఖర్చు పెట్టడం లేదు. కథ అలా డిమాండ్ చేసింది. ప్రీ ఇండిపెండెన్స్ నేపథ్యంలో జరిగే కథ ఇది. ఆ వాతావరణం సృష్టించడానికి సెట్లు వేయాల్సిందే. కాబట్టి.. ఖర్చు పెరుగుతోంది. ఈ సినిమాలో కొంతమంది స్టార్ తారాగణాన్ని కూడా దించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. అందుకే ఇంత బడ్జెట్ అవుతోంది. ప్రస్తుతానికి స్క్రిప్టు లాక్ చేసేశారు. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తారు.