తేజ… తన సినిమాల కంటే.. మాటలే విచిత్రంగా ఉంటాయి. తన మాటల్ని వింటే `మరో వర్మలా ఉన్నాడే` అనిపిస్తుంటుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు. షుగర్ కోటింగు వ్యవహారాలు అస్సలు తెలీవు. స్టార్ హీరోల కోసం పరుగులు పెట్టడం, వాళ్లని కాకాపట్టడం చేతకావు. అందుకే స్టార్ హీరోలతో సినిమాలు చేయలేకపోయాడు తేజ. వెంకటేష్‌తో సినిమా చేసే ఛాన్స్ అయితే ఓసారి వచ్చింది. కానీ.. చివరి నిమిషంలో ఆసినిమా ఆగిపోయింది. అసలు ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది? అని తేజని అడిగితే `మూడ్ బాలేక ఆ సినిమా నేనే చేయలేదు` అని తనదైన స్టైల్లో విచిత్రమైన సమాధానం చెప్పాడు. ఎవరి మూడ్ బాలేదు? తేజదా? వెంకీదా? లేదంటే కథని ఫైనల్ చేసే సురేష్ బాబుదా? అనేదే క్లారిటీ లేదిక్కడ.
నిజానికి తేజ చెప్పిన కథ వెంకీకి కూడా బాగా నచ్చింది. సురేష్ బాబునే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాడని టాక్. ద్వితీయార్థం విషయంలో సురేష్ బాబు -తేజ మధ్య చాలాసార్లు సిట్టింగులు జరిగాయని, సెకండాఫ్ బాగోలేకపోవడం వల్ల సురేష్ బాబు మార్పులూ, చేర్పులూ చేస్తూ కాలక్షేపం చేస్తూ వచ్చాడని, అదంతా భరించలేక తేజ బయటకు వచ్చేశాడని టాక్. వెంకీకి చెప్పిన కథనే అటూ ఇటూ మార్చి `సీత`గా తీశాడిప్పుడు. ఆ రిజల్ట్ కూడా చూస్తూనే ఉన్నాం. సురేష్ బాబు తన తమ్ముడి ఖాతాలో ఓ ఫ్లాపు రాకుండా కాపాడుకున్నాడన్నమాట.