తేజ సినిమాలో క్యారెక్టరైజేషన్లు కాస్త భిన్నంగా ఉంటాయి. నటీనటుల్లోని ప్రతిభని పూర్తి స్థాయిలో పిండుకునే ప్రయత్నం చేస్తుంటారాయన. అప్పటి వరకూ చూసిన హీరోనే, తేజ సినిమాలో కొత్తగా కనిపిస్తాడు. మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న నటుడిలోంచీ భిన్నమైన కోణాన్ని ఆవిష్కరిస్తారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నారు తేజ. ఇందులో కాజల్ కథానాయిగా నటిస్తోంది. బెల్లంకొండ పాత్ర `చంటి`లో వెంకటేష్‌ని పోలి ఉంటుందని సమాచారం. బోలెడంత అమాయకత్వం, మంచితనం కలగలిపిన క్యారెక్టరైజేషన్ బెల్లంకొండలో కనిపిస్తాయని తెలుస్తుంది. అయితే.. మాస్‌కి కావల్సిన అంశాలూ ఉండాలి కదా? అందుకే 5 విభిన్నమైన ఫైట్లను కూడా కథలో భాగంగా జోడించార్ట. వెంకటేష్‌తో ఓ సినిమా చేద్దామనుకున్నారు తేజ. స్క్రిప్టు కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఆ కథనే బెల్లంకొండతో తీస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ రెండు కథలూ వేర్వేరని, వెంకీ స్క్రిప్టుని తేజ పూర్తిగా పక్కన పెట్టేశాడని తెలుస్తోంది.