నేనే రాజు నేనే మంత్రితో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు తేజ. వెంకటేష్, బాలయ్య సినిమాల్ని ఒకే చేసుకున్నాడు. అయితే `ఎన్టీఆర్` నుంచి అర్థాంతరంగా తప్పుకుని షాక్ ఇచ్చాడు తేజ. మరోవైపు వెంకటేష్ సినిమానీ వదిలేశాడు. ఆ తరవాత.. మరో సినిమా గురించి ఆలోచనే చేయలేదు. మధ్యలో ఉదయ్ కిరణ్ బయెపిక్ ప్రస్తావనకు వచ్చింది. అయితే.. తేజ ఆ ప్రాజెక్టుపై కూడా ఆసక్తి చూపించలేదు. మరి తేజ తదుపరి సినిమా ఎవరితో? అసలు సినిమాలు చేసే ఉద్దేశం ఉందా, లేదా? లేదంటే పూర్తిగా రిలాక్స్ అయిపోయాడా? అంటూ సందేహాలు వెల్లువెత్తాయి. తేజ దృష్టి సినిమాలపైనే ఉందిప్పుడు. కాకపోతే.. ఎప్పట్లా స్లో.. అండ్ స్టడీ పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఆయన తన తదుపరి సినిమాని బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ‘మా అబ్బాయితో ఓసినిమా చేసి పెట్టాలి’ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ తేజని కోరాడట. కొత్తవాళ్లతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపించే తేజ.. బెల్లంకొండతో ఓ ప్రాజెక్టు సెట్ చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. తేజ కథల ఎంపికలో ఇటీవల కొన్ని మార్పులొచ్చాయి. రొడ్డకొట్టుడు ప్రేమకథలకు ఆయన దూరమయ్యారు. ఈసారీ కూడా ఓ కొత్త జోనర్ ని తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బెల్లంకొండ చేతిలో రెండు సినిమాలున్నాయి. సాక్ష్యం విడుదలకు సిద్ధమైంది. శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ. అదీ పూర్తయితే తేజ సినిమా పట్టాలెక్కొచ్చు.