సినిమా బడ్జెట్ అనేది ఆ హీరో మార్కెట్ని బట్టి, క్రేజ్ ని బట్టి నిర్ణయిస్తారు. కథ డిమాండ్ చేస్తే.. అటూ ఇటూగా బడ్జెట్ పెంచుతారు. అయితే ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. పాన్ ఇండియా అనే రెక్కలొచ్చాయి. పాన్ ఇండియా స్థాయి కథ పుడితే.. హీరో స్థాయిని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు `హను మాన్`కి అదే జరుగుతోంది. తేజా సజ్జా హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ప్రశాంత్ వర్మ దర్శకుడు.
ప్రశాంత్ వర్మ ముందు నుంచీ డిఫరెంట్ జోనర్లు ఎంచుకొంటూ ప్రయాణం సాగిస్తున్నాడు. తేజా సజ్జాతో రూపొందించిన `జాంబి రెడ్డి` ఆర్థికంగా మంచి విజయాన్ని అందుకుంది. అందుకే మరోసారి తేజాతోనే `హనుమాన్` పట్టాలెక్కించాడు. ఈ సినిమా బడ్జెట్ అటూ ఇటూగా రూ.30 కోట్లని సమాచారం. తేజాపై ఇంత బడ్జెట్ పెట్టడం అంటే రిస్కే. కాకపోతే… పాన్ ఇండియా మార్కెట్ స్ట్రాటజీ ఈ సినిమాని బాగా ఉపయోగపడింది. ఇప్పటికి ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ మొత్తం కలిపి రూ.22 కోట్లని అమ్మేసినట్టు తెలుస్తోంది. అంటే మరో 8 కోట్లు రాబడితే చాలు. సినిమా బాగుంటే థియేటర్ల నుంచి ఆ మాత్రం సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. ఈ సినిమా గనుక పెట్టుబడిని తిరిగి సంపాదించుకోగలిగితే అటు తేజా, ఇటు ప్రశాంత్ వర్మ.. కెరీర్లు నెక్ట్స్ లెవెల్ కి వెళ్లిపోయినట్టే.