హైదరాబాద్: దర్శకుడు తేజ తీసిన తాజా చిత్రం ‘హోరాహోరీ’ ఈనెల 11న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇటీవల మీడియాతో మాట్లాడిన తేజ తెలుగు చలనచిత్ర పరిశ్రమపై ఒక కొత్త థియరీ చెప్పారు. పదేళ్ళనాడు వచ్చిన తన సూపర్ హిట్ చిత్రం ‘జయం’ను అప్పట్లో ఐదుకోట్లమంది చూశారని, అది బంపర్ హిట్ అయిందని, ఇప్పటికీ దానిగురించి చెప్పుకుంటారని అన్నారు. చాలారోజుల తర్వాత రెండున్నరకోట్లమంది ఇటీవల వచ్చిన బాహుబలి చిత్రాన్ని చూశారని, దానికే అంత కలెక్షన్లు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు కామెడీ ఆధారంగా వస్తున్న హిట్ చిత్రాలను చూసేది కేవలం 80 లక్షలమందేనని తెలిపారు. అందరికీ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనే పిచ్చి పట్టుకోవటంతో థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గిపోయిందని చెప్పారు. కామెడీ ఉన్న చిత్రాలు యావరేజ్ హిట్ అవుతాయని అన్నారు. ఆడియన్స్ను నవ్విస్తే యావరేజ్ అవుతాయని, ఆడియన్స్ కళ్ళలో నీళ్ళు తెప్పించగలిగితే సూపర్ డూపర్ హిట్ అవుతాయని ఒక కొత్త సిద్ధాంతాన్ని లేవదీశారు తేజ. అంటే హోరాహోరీ చిత్రంతో ప్రేక్షకుల కళ్ళలో నీళ్ళను తెప్పించే ప్రయత్నం చేశారన్నమాట. తేజ గురించి తెలియనిదేముంది! వెరైటీగా, డిఫరెంట్గా మాట్లాడుతుంటారు. మరి సుదీర్ఘ విరామం తర్వాత తీసిన హోరాహోరి చిత్రాన్ని ఏం చేస్తారో తెలుసుకోవాలంటే మరొక్కరోజు ఆగాల్సిందే.