తేజ అంటే కాజల్‌కి గౌరవం.. గురు భక్తి. ఎందుకంటే లక్ష్మీ కల్యాణంతో తెలుగు చిత్రసీమకు పరిచయం చేసింది తేజనే. అప్పటి నుంచీ.. కాజల్ విజృంభణకొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న నేనే రాజు నేనే మంత్రి సినిమాలోనూ కాజల్ కథానాయికగా కనిపించింది. ఆమె కు అది 50వ సినిమా. అటు 1 ఇటు 50 సినిమాలకూ తేజనే దర్శకుడు. క్లిష్టమైన సమయంలో తనకు మరో హిట్టు ఇచ్చాడు తేజ. అందుకే ఆ గురు భక్తి మరింత పెరిగింది. తేజ – వెంకీల కాంబినేషన్లో సినిమా అనగానే అందులో కథానాయికగా కాజల్ ఎంపికైందన్న వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడు అనూహ్యంగా శ్రియ వచ్చి చేరింది. కాజల్ ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తోందని, అందుకే ఆమె స్థానంలో శ్రియని తక్కువ పారితోషికానికి ఒప్పించి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే నిజానికి… ఈ సినిమా కోసం కాజల్ పేరు ప్రస్తావనకే రాలేదు. వచ్చినా.. అది కాజల్ వరకూ వెళ్లలేదు. ఎందుకంటే తేజ అడిగితే కాజల్ `నో` చెప్పే సమస్యే లేదు. పైగా కాజల్ మరీ అంత బిజీ షెడ్యూల్లో ఏం లేదు. వరుసగా కాజల్‌తోనే సినిమాలు చేయడం ఎందుకని.. తేజ గ్యాప్ తీసుకున్నాడంతే. పైగా ఈ కథకు.. శ్రియ అయితేనే బాగుంటుందని భావించార్ట. అనుష్క పేరు ప్రస్తావనకు వచ్చినా… ఎందుకో చివరి నిమిషంలో శ్రియ ఈ ఆఫర్ ఎగరేసుకుపోయింది.