‘హనుమాన్తో’ తేజా సజ్జా ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రూపుదిద్దుకొంటోంది. ఇందులో తేజా సజ్జా ఉంటాడా, ఉండడా? అనేది పెద్ద ప్రశ్న. నిజానికి ఈ సినిమాలో తేజా ఉంటాడు కానీ, కథ మాత్రం హనుమంతుడి చుట్టే తిరుగుతుంది. `హనుమాన్` కథలో.. హనుమంతుడు ఓ పార్ట్. ఆ కథంతా తేజా సజ్జాది. ‘జై హనుమాన్‌లో’ ఇది రివర్స్. ఇది హనుమంతుడి కథ. అందులో తేజా సజ్జా ఓ పార్ట్ మాత్రమే. ‘జై హనుమాన్‌లో’ తేజా అతిథి పాత్ర అనుకోవాలంతే. ఈ విషయాన్ని తేజ కూడా ఒప్పుకొన్నాడు. ”హనుమాన్ కథ హనుమంతుల రాకతో ముగుస్తుంది. ‘జై హనుమాన్’ కథ అక్కడ్నుంచి మొదలవుతుంది. ఆ హనుమంతుడి కథలో నేను కూడా ఉంటానంతే” అంటూ పరోక్షంగా తనది అతిథి పాత్ర అని డిక్లేర్ చేసేశాడు.
ఇప్పుడు సమస్యల్లా… ‘జై మనుమాన్’ కథని ఎవరి కోణంలో నడిపిస్తారన్నది. ఒకవేళ అది హనుమంతుడి కథే అయితే… ‘హనుమాన్’లో చూపించినట్టు ఆ పాత్రని పూర్తిగా గ్రాఫిక్స్‌లో చూపిస్తే కుదరదు. రాముడి పాత్రని గ్రాఫిక్స్‌లో సృష్టించినా ఫర్వాలేదు కానీ, హనుమంతుడి పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించాల్సిందే. రణవీర్ సింగ్‌తో ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేస్తాడని గట్టిగా ప్రచారం జరుగుతోంది. మరి హనుమంతుడి పాత్రలో తనని గనుక తీసుకొస్తారా? వెయిట్ అండ్ సీ!