టాలీవుడ్ బాలీవుడ్ అనే సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఎవరైనా, ఎక్కడైనా సినిమా చేసేయొచ్చు. ఎక్కడ సినిమా తీసినా.. ఎక్కడైనా ఆడించుకోవచ్చు. అందుకే దర్శకులూ ఇప్పుడు మిగిలిన భాషల్లో తమ ప్రతాపం చూపించాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తేజ బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం తేజ `అహింస` అనే సినిమా తీస్తున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఆయన తదుపరి అడుగు… బాలీవుడ్ లోనే. అక్కడ రెండు ప్రాజెక్టులు చేయడానికి ఒప్పుకున్నారు తేజ. టైమ్ ఫిల్మ్స్, ఎన్.హెచ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. `జఖమి` అనే ఓ హిందీ సినిమాతో పాటుగా… `తస్కరి` అనే ఓ వెబ్ సిరీస్ ని తెరకెక్కించబోతున్నారు తేజ. జఖమి కశ్మీరీ నేపథ్యంలో సాగే సినిమా. ఇందులో ఇద్దరు హీరోలుంటారు. `తస్కరి` 1980 ముంబైలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కబోతోంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోనే ప్రకటించబోతున్నారు.