రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్న నరేంద్రమోడీ, బీహార్ ప్రజల మనసును చదివేసిన నితీష్ కుమార్.. ఇప్పుడు ఇద్దరూ.. బీహార్‌లో కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేస్తున్నారు. పదిహేనేళ్ల నితీష్ పాలనను చూసి ఓటేయమని అడుగుతున్నారు. వీరిని సవాల్ చేస్తోంది.. బీహార్ అంటే.. లాలూ అని అనిపించుకునేలా చేసిన లాలూ ప్రసాద్ యాదవ్ కాదు. ఆయన జైల్లో ఉన్నారు. ఆయన చిన్న కుమారుడు తేజస్వి యాదవ్. తేజస్వి యాదవ్ వయసు 30 ఏళ్లు. ఆయన ఇప్పుడు బీహార్‌ను సుడిగాలిలా చుట్టబెడుతున్నారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలను సమన్వయం చేసుకుని మహాకూటమిని నిర్మించారు. బలమైన అభ్యర్థులను ఎంపిక చేశారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
తేజస్వి దూకుడుకు.. మోడీ, నితీష్ కుమార్ కంగారు పడుతున్నారు. తేజస్విపై.. ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. లాలూ కుటుంబాన్ని అరాచక ఫ్యామిలీగా మోడీ అభివర్ణిస్తున్నారు. లాలూ హయాంలో జంగిల్ రాజ్ ఉందని… తేజస్వికి ఓటు వేస్తే.. మళ్లీ లాలూ వారసుడిగా… అరాచక పాలనను తీసుకొస్తారని.. మోడీ ఎటాక్ చేస్తున్నారు. ఇక పదిహేనేళ్ల పాటు సీఎంగా ఉన్న నితీష్ అయితే… తేజస్వి పుట్టుకను కూడా ప్రశ్నించేంత అసహనంతో ఉన్నారు. లాలూ తండ్రి పుత్రుని కోసం తొమ్మిది మంది సంతానాన్ని కన్నారని… వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు. మోడీ, నితీష్ ఇద్దరూ… తేజస్విపై నేరుగా ఎటాక్ చేస్తున్నా… లాలూ వారసుడు మాత్రం.. చాలా నింపాదిగా ఉన్నారు.
30 ఏళ్ల తేజస్వి.. తనపై విమర్శలు చేస్తున్న సీనియర్ ప్రత్యర్థులపై ఒక్క మాటంటే.. ఒక్క మాట కూడా వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు. తన తండ్రిని విమర్శించినా.. ఆయన సహనం కోల్పోవడం లేదు. నితీష్ కుమార్ అలసిపోయారని.. అందుకే అలా మాట్లాడుతున్నారని.. ఆయనకు విశ్రాంతి కావాలని కౌంటర్ ఇస్తున్నారు. మొదటి దశ ఎన్నికల్లో ఆర్జేడీకి అడ్వాంటేజ్ ఉందన్న అభిప్రాయం ఏర్పడింది. దీంతో తేజస్వి మరింత హాట్ టాపిక్‌గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ – ఆర్జేడీ కలిసి పోటీ చేశాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చాక.. తేజస్విపై ఈడీ కేసును బూచిగా చూపి… ఆర్జేడీని బయటకు పంపేసి.. బీజేపీ ప్రభుత్వంలో చేరింది. ఇప్పుడు ఆ సానుభూతి కూడా.. బీహార్ ప్రజల్లో కనిపిస్తోంది. ఇంతా చేసి తేజస్వి.. స్కూల్ చదువు కూడా పూర్తి చేయలేదు.. కానీ తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లో మాత్రం పీహెచ్డీ చేసినట్లుగా నిపిస్తోంది.