బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన నితీష్ కుమార్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మాహాకూటమిలో భాగస్వాములుగా ఉన్న ఆర్.జె.డి. కాంగ్రెస్ పార్టీల నుండి ఎవరెవరు ఆయన ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారో ఇంకా తెలియనప్పటికీ, ఇటీవల జరిగిన ఎన్నికలలో రాఘోపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయిన లాలూ ప్రసాద్ యాదవ్ రెండవ కుమారడు తేజస్వీ ప్రసాద్ యాదవ్ రేపు బిహార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం నుండి ఎవరో ఒకరు ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి పదవి చేపడతారని ముందు నుంచి అనుకొంటున్నదే. కానీ పెద్దవాడు ఉండగా చిన్నవాడయిన తేజస్వీ ప్రసాద్ యాదవ్ కి ఆ అవకాశం కల్పిస్తారని ఎవరూ అనుకోలేదు. నిజానికి లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమార్తె మీస భారతిని ఉప ముఖ్యమంత్రిగా చేయాలని మొదట భావించారు. కానీ ఆమె శాసనసభ, మండలిలో సభ్యురాలు కాకపోవడంతో ఆ ప్రతిపాదన విరమించుకొన్నట్లుంది. ఆమెకు బదులు లాలూ తన రెండవ కుమారుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం జరుగబోయే శాసనసభ పక్ష సమావేశంలో అతనిని తమ నేతగా ఎన్నుకోవచ్చునని తెలుస్తోంది.
బిహార్ ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ ప్రసాద్ యాదవ్ రేపు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది కనుక ఆయన వివరాలు తెలుసుకోవడం సబబే. ఆయన డిల్లీలోని డిల్లీ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి వరకు చదువు కొన్నారు. అదే అయన అత్యన్నత విద్యార్హత.
ఝార్ ఖండ్ రాష్ట్ర క్రికెట్ టీమ్ కి ఆయనే కెప్టెన్ గా వ్యవహరించేవారు. డిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ తరపున కూడా రెండు సార్లు ఆడారు. ఆయన చదువు ఏవిధంగా సాగిందో క్రికెట్ ఆట కూడా అందుకు ఏమాత్రం తీసిపోకుండా సాగింది. ఆయన అన్ని ఫార్మాట్స్ కలిపి మొత్తం 7 మ్యాచులు ఆడి మొత్తం 36 పరుగులు తీసారు. అలాగే ఏడు మ్యాచుల్లో కలిపి మొత్తం 90 బాల్స్ వేసి ఒకే ఒక వికెట్ తీసుకొన్నారు. ఆయన సాధించిన ఆ పరుగులు, ఆ ఒక్క వికెట్ వెనుక తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ హస్తం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఉండి ఉంటే ఆ సంఖ్యల పక్కన మూడో నాలుగో సంఖ్యలు తప్పక ఉండేవేమో. ఇక తేజస్వీ ప్రసాద్ యాదవ్ కి విద్యాశాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలనే ఆశయం కూడా ఉందని సమాచారం. ఒకవేళ రేపు ఆయన ఉప ఎన్నికలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినట్లయితే, ఇక బిహార్ వెనుతిరిగి చూసుకోనవసరం లేదేమో.