ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు. తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. వైసీపీ బీఫాం తనకే వస్తుందని లేకపోతే.. స్వతంత్రంగా బరిలోకి ఉంటానని అంటున్నారు.
దువ్వాడ శ్రీనివాస్ ను మొదట టెక్కలి ఇంచార్జ్ గా పెట్టారు. ఆయన అనధికారిక ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఓ మహిళకు పనులు చేసి పెట్టి ఆమెతో వివాహేతర బంధం పెట్టుకున్నారు. దీనిపై ఇంట్లో రచ్చ జరగడంతో .. జడ్పీటీసీ అయిన దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి.. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. తనకు ఇంచార్జ్ .. టిక్కెట్ ఇస్తే సరే లేకపోతే రచ్చ చేస్తామని హెచ్చరించారు. చివరికి వారి కుటుంబ సమస్య కాబట్టి దువ్వాడ అంగీకారంతోనే వాణిని ఇంచార్జ్ గా నియమించారు.
కానీ అభ్యర్తులను ప్రకటించే ముందు.. మళ్లీ సీన్ మార్చేశారు. దువ్వాడ శ్రీనివాస్ కే అభ్యర్థిత్వం ఇచ్చారు. దీంతో దువ్వాడ శ్రీవాణి మరింత ఫైర్ అవుతున్నారు. ప్రత్యేకంగా క్యాడర్ ను మెయిన్ టెయిన్ చేస్తున్న ఆమె.. నామినేషన్ కు సిద్ధమయ్యారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పోటీ చేస్తూండటంతో కాళింగ ఓట్లు చీలిపోతాయని.. కంగారులో ఉంటే.. ఇప్పుడు భార్యే రెబల్ గా పోటీ కి సిద్ధపడటం దువ్వాడ శ్రీనివాస్ కు ఇబ్బందికరంగా మారింది. కుటుంబాన్ని చక్కదిద్దుకోలేని ఆయన.. నియోజకవర్గంలో ఎలా గెలుస్తాడన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.