ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో వలస కార్మికుల ఇష్యూ పెద్ద సమస్యగా ఉంది. అందర్నీ వారి సొంత రాష్ట్రాలకు తరలిస్తున్నారు. లాక్ డౌన్ కు సడలింపులు ఇస్తున్న సమయంలోఇలా వలస కూలీలను వారి వారి రాష్ట్రాలకు పంపిస్తే.. తర్వాత అనేక రంగాలపై ఆ ప్రభావం పడుతుంది. సరైన మ్యాన్ పవర్ దొరక్క పనులు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. తెలంగాణ సర్కార్ ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించింది. తెలంగాణ నుంచి వలస కూలీలు ఎవరూ వెనక్కి వెళ్లకుండా.. చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం.. లాక్ డౌన్ నిబంధనలతో సంబంధం లేకుండా.. నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా ఆదేశాలు ఇచ్చింది. భవన నిర్మాణాలు ఇక నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది.
నిర్మాణ పనులకు అవసరమైన సామాగ్రి తరలింపు విషయంలోనూ ఎలాంటి ఆటంకాలు రానివ్వబోమని.. పోలీసులు బిల్డర్లకు హామీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ సహజంగానే రియల్ ఎస్టేట్ హబ్. చుట్టుపక్కల ఎప్పుడూ.. పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. కానీ నలభై రోజులుగా మొత్తం ఆగిపోయాయి. కూలీలు అక్కడే నివాసం ఉంటూ పని చేస్తూ ఉంటే… పనులు ప్రారంభించుకోవచ్చని గతంలో పర్మిషన్ ఇచ్చారు. కానీ మెటీరియల్ రవాణా చేసే పరిస్థితి లేకపోవడంతో.. పెద్దగా ప్రారంభం కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం… అలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలంగాణ సర్కార్ హామీ ఇస్తోంది.
ఇప్పటికీ యాక్టివ్ కేసులు ఉన్న కంటెయిన్మెంట్ జోన్లలో మాత్రమే.. ఆంక్షలు ఉంటాయి. మిగతా అన్ని చోట్లా పనులు చేసుకోవచ్చు. వలస కార్మికులు ఒక్క సారి సొంత రాష్ట్రాలకు వెళ్తే.. వారిని మళ్లీ వెనక్కితీసుకు రావడం అంత తేలిక కాదు. ప్రస్తుతం వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఇది మరింత కష్టం.అదే జరిగితే.. నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అది ఆర్థికాభివృద్ధికి విఘాతం అవుతుంది. అందుకే తెలంగాణ సర్కార్ చురుగ్గా ఆలోచించి.. వలస కూలీలకు ఉపాధి దొరికేలా తక్షణం చర్యలు తీసుకుంది.