దేశంలోనూ, రాష్ట్రాలలోనూ సమస్త విషయాలను ప్రభావితం చేసే అధినేతలకు వ్యూహం తక్కువైనా ఎక్కువైనా కష్టమే. అతిగా కంగారు పడి అమితంగా మాట్లాడితే మరింత నష్టం. నాకు వృత్తిపరంగా అనేక మంది కీలక నేతలను కూడా సన్నిహితంగా చూసే మసలే మాట్లాడే పోట్లాడే అవకాశం కలిగింది. అందుకే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆచితూచి అడుగేస్తారని అఘటన ఘటనా సమర్థుడని పేరున్న చంద్రబాబు వాస్తవంలో అతిజాగ్రత్తకు మారుపేరు. అభద్రతను రేకెత్తించేవారు, వున్నవీ లేనివీ చెప్పి ఆందోళనకు గురి చేసేవారు ఆయనచుట్టూ కొందరుంటారు. ే రాష్ట్ర విభజన ఉద్యమ సమయంలోనూ సమాంతరంగా వచ్చిన జగన్ రాజకీయ విజృంభణ తరుణంలోనూ ఆయన అతిగా ఒత్తిడికి గురి కావడం, ప్రత్యక్షంగా చూశాను. గత మూడు నాలుగు నెలలుగా మరోసారి అలాటి అతి స్పందనే చూస్తున్నాను. ప్రతిపక్ష నేత జగన్పై దాడి తర్వాత మాట్లాడిన తీరు హడావుడిగా ఢిల్లీ యాత్ర కూడా ఆ తరహాలోనే వున్నాయి. అతి డిఫెన్సు, అమితమైన అఫెన్సు వలయంలో టిడిపి చిక్కుకుపోయింది.
ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే ఖండించడం, సమగ్ర విచారణ జరుపుతామని చెప్పడం, ఇతర ఆరోపణలను కొట్టిపారేయడం సహజం. కాని జగన్ దాడి నాటకమంటూ ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు పార్టీ నేతలు వరుస కట్టి చేసిన వ్యాఖ్యానాలు అనాలోచితమైనవి, ఆమోదించలేనివి. వైసీపీ నాయకులు కూడా సంయమనం పాటించి వుండాల్సింది కాని ఇలాటి సందర్బాల్లో అధికారంలో వున్నవారిపై ఆరోపణలు చేయడం కొత్తకాదు. వాటిపై అన్ని విషయాలు తేలుస్తామని చెబితే సరిపోతుంది. కాని హోం మంత్రి తొలి వ్యాఖ్యలే అసందర్భంగా మారాయి. ఆ తర్వాత డిజిపి ఠాగూరు తొండరపాటు వ్యాఖ్యలు .చంద్రబాబు వీటిని అదుపు చేసి తేలిగ్గా కొట్టిపారేసి వుండొచ్చు. దానికి బదులు ఆయన మొత్తం సైన్యాన్ని రంగంలోకి దింపారు. తాను కూడా ఇదంతా ే నాటకం అనేశారు. అలా అన్నాక విచారణకు విలువేముంటుంది? ఫ్లెక్సీలు క్లిప్పింగులు దొరికితే వెంటనే సోషల్మీడియాలోవదలడం కూడా సందేహాలు పెంచుతుంది. జగన్కు తానే ఫోన్ చేసి వుండొచ్చు. అందుకు బదులు కెసిఆర్ ఫోన్ను తప్పు పట్టారు. దాడిని ఖండించిన కెటిఆర్, పవన్, తననే ఖండించినట్టు ఆగ్రహించారు. ఈ ఖండనలను తిత్లీ తుపానుతో పోలిక పెట్టడం కూడా అసందర్భమే. గవర్నర్ నరసింహన్ డిజిపికి ఫోన్చేయడం కూడా కుట్ర అనేశారు. ఇలా తె లియకుండానే అందరినీ శత్రు శిబిరంలోకి నెట్టేశారు. కలెక్లర్ల ముందు ఏకరువు పెట్టారు.
మొదటి రోజు అలా మాట్లాడి వుండకూడదన్న విమర్శలు రావడంతో రెండవ రోజు సమర్థన కోసం తీవ్రత పెంచారు. మంత్రి సోమిరెడ్డి అతడు సినిమాను చెబితే పరిటాల సునీత మరేదో చెప్పారు. మొత్తంపైన టిడిపి నాయకశ్రేణి మొత్తం రెండవ రోజు కూడా ఎదురు దాడి చేయబోయి జగన్ చుట్టూనే చర్చను తిప్పడానికి కారణమైనారు. ఈ క్రమంలో మరింత ఒంటరిపాటుకు గురయ్యారు. ఎందుకంటే టిడిపి నేతలు ఎంత గింజుకున్నా ఇ్లలాటి సందర్భంలో ఇతర పార్టీల నేతలెవరూ నాటకం అనేందుకు సిద్దం కారు. పైగా ఎపిలో సానుభూతి రాజకీయాలు పనిచేయవని చంద్రబాబుపై అలిపిరి దాడి తర్వాతి ఎన్నికలు రుజువు చేశాయి.పోనీ మాటవరసకు సానుభూతి నాటకం అన్నా ఆధారాలు పట్టుకోవాలి గాని మాటలు దొర్లించేస్తే ఎవరు ఒప్పుకుంటారు? జగన్పై దాడి చేసిన శ్రీనివాసరావు ఫ్లెక్లీలో వున్నంత మాత్రాన కుటుంబ సభ్యులు చెప్పినంత మాత్రాన నిజం కావచ్చు, నాటకం కావచ్చు. మేము తెలుగుదేశంలో వున్నామని కూడా అతని సోదరుడు ఒక టీవీకి చెప్పింది నేను విన్నాను. పైగా తను పనిచేస్తున్నది టిడిపి నేత హోటల్లో. విమానాశ్రయం కేంద్రం అధీనంలోని సిఐఎస్ఎఫ్ భద్రతలో వుంటుందనేది నిజమే. కాని విశాఖ పట్టణం ఎపిలోనే వుంది గనక రాజకీయాలు రాకుండా పోతాయా? పైగా ఆరు మాసాల కిందటి వరకూ విమాన యాన మంత్రిది అదే ప్రాంతం అదే పార్టీ. ఇలాటివన్నీ దర్యాప్తుకు వదలివేయకుండా అధినేతలు మాట్లాడ్డం అధికారులతో మాట్లాడించడం అనుచితమైన చర్యలు. దాడి తర్వాత వెంటనే అల్లర్లు వచ్చేస్తాయన్నట్టే మాట్లాడారు. కాని ప్రజలు ప్రశాంతతను కాపాడారు. రాష్ట్రపతి పాలన పెట్టేస్తారని టిడిపి వారే రభస ప్రారంభించారు. ఆ కోర్కె ఇప్పటికి బిజెపి నుంచి మాత్రమే వచ్చింది. బిజెపి ని అనడంతో ఆగక ే వైసీపీని జనసేనను కూడా ఆ జాబితాలో చేర్చారు. ఇదంతా అనవసరమైన వులికిపాటే. కేంద్రం జోక్యం ఎవరు కోరినా ప్రజలు హర్షించరు. వామపక్షాలు గాని కాంగ్రెస్ గాని ప్రజాస్వామ్య ప్రియులు గాని ఒప్పుకోరు. అసలు కేంద్రం అంత దుస్సాహసం చేయగల స్తితిలో లేదు.
రాష్ట్రంలో రచ్చ చాలనట్టు చంద్రబాబు దీన్ని ఢిల్లీకి చేర్చారు. ఆ పర్యటన ఏదో మహత్కార్మమైనట్టు అనుకూల మీడియాలో అతిగా ప్రచారం చేశారు. దద్దరిల్లిన ఢిల్లీ అన్నారు. జాతీయ మీడియా ఈ పర్యటనకు ఏమీ ప్రాధాన్యత నివ్వలేదు. ఎపిలో గాని మరెక్కడ ఇలాటి ఘటన జరిగినా వ్యవధి తీసుకుంటారు గాని టిడిపి కథనాన్నే తలకెక్కించుకోవడం మీడియా చేయదు. పైగా ఇప్పుడు జాతీయ మీడియాపై ప్రధాని మోడీ పట్టు కూడా ఎక్కువే. గతసారి ఎన్డిఎ నుంచి టిడిపి నిష్క్రమించినప్పుడు కూడా జాతీయ మీడియా లో చాలా మంది పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇవన్నీ చంద్రబాబు వూహించదగినవే. ఆఖరుకు హాస్యాస్పదమైన ఆపరేషన్ గరుడ గురించి కూడా అధికారికంగా చెప్పి వచ్చారంటే ఎంత పొరబాటు? జాతీయంగా బిజెపి రాజకీయ వ్యూహాలు కుట్రలను ఎదుర్కొవడానికి చంద్రబాబు ఇతర జాతీయ ప్రాంతీయ పార్టీలను కలుసుకుంటే మంచిదే. ఆయనకు అనుభవం కూడా వుండొచ్చు. కాని నాలుగేళ్లు బిజెపితో వుండి వచ్చారన్నది కూడా నిజం. పరస్పర గౌరవంతో రాజకీయ దౌత్యంతో జరగాల్సిన ఈ వ్యవహారాలను బాబు భజన బృందం ఆయన గొప్పగా టముకు వ్పేసే అవతల్తి వారికి ఏం విలువుంటుంది?కెసిఆర్ విఫలమైనట్టు చంద్రబాబు సఫలమైనట్టు కూడా ఒక కథనం ఇచ్చారు. కెసిఆర్ బిజెపికి మాత్రమే వ్యతిరేకం కాదు. కాంగ్రెస్కు ఎక్కువ వ్యతిరేకం పైగా చంద్రబాబు దగ్గర మంత్రిగా చేసిన వారు. ఈ పోటీలు పోలికలు దేనికి? ఢిల్లీలో ఇలాటి సమీకరణలు సంప్రదింపులు నిరంతరం జరుగుతూనే వుంటాయి. తుదిఫలితం లెక్కకు వస్తుంది గాని సమావేశాలు జరపడమే ఘనత అనుకోరు. జెస్పి నాయకులతో ఇటీవలనే పవన్ కళ్యాణ్ కలిశారు గనక చంద్రబాబుమాయావతిని కలుసుకోవాలనుకున్నారు.తెలంగాణ సీట్లపైనా ఆయన ఢిల్లీలోనే సర్దుబాట్లు చేస్తున్నారు. ఇన్ని కోణాలున్న ఈ పర్యటన కేవలం జగన్ దాడి అనంతర నేపథ్యంలోకి పోతే టిడిపికి మేలు చేస్తుందా? దేశంలో సీనియర్ మోస్ట్నంటున్న చంద్రబాబు ఇవన్నీ ఆలోచించవద్దా మరి?
-తెలకపల్లి రవి