పవన కళ్యాణ్‌కూ కొన్ని ఛానళ్లకూ మధ్యన నడుస్తున్న ప్రత్యక్ష పరోక్ష సమరంలో నిజానిజాల నిరూపణ ఏమంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఇవన్నీ సూటిగా జరిగే వ్యవహారాలు కాదు. తల్లిపై దుర్భాషలాడటం అన్న మాట చుట్టే వివాదం నడుస్తున్నా వాస్తవానికి అంతకు మించిన అంశాలు ఇందులో అంతర్లీనంగా వున్నాయి. అవి మీడియాలో మొదలైనవే తప్ప పవన్‌తో కాదు. వాటిలో ఎక్కడా ఆయన పేరు వచ్చింది లేదు. కాని మలిదశలో హఠాత్తుగా హీరోలందరిలోనూ ఆయన పేరే ముందుకు రావడం వల్ల అనుమానాలు కలిగాయి.అనవసరంగా ఆయనపై నోరు పారేసుకోవడం అనుమానాలు పెంచింది. దీని వెనక తానున్నానని రామ్‌గోపాల్ వర్మ నేరుగా అంగీకరించడం అనుమానాలను వాస్తవాలుగా చేసింది. కాబట్టి ఈ కథలో ఇప్పటి వరకూ జరిగింది ఆయన ప్రమేయం లేనిదే. తర్వాత ఆయన ప్రతిస్పందన తీవ్రంగా వుందని, హీరోగా గాక రాజకీయ నాయకుడుగా కూడా ఆయన సంయమనం పాటించివుండవలసిందని చాలా మంది అంటున్నారు. నిజమే కావచ్చు గాని ఎవరూ మీడియాధిపతులు స్పందించనపుడు పైగా ఈ వివాదాలకు ఆజ్యం పోసే పని కొందరు చేస్తున్నప్పుడు ఆగ్రహం కలగడంలో ఆశ్చర్యం లేదు. ఈ క్రమమంతటినీ వదలిపెట్టి కేవలం వాహనాలపై దాడిని మాత్రమే మళ్లీ మళ్లీ చూపించడం సమస్యను ఒక వైపునకు నెట్టేస్తుంది. ఈ విధ్వంసాన్ని ఈ రోజు ఎబిఎన్ ఫోన్ఇన్లోఖండించాను. హింసాకాండకు పాల్పడవద్దని పవన్ తన అభిమానులకు బహిరంగంగానే పిలుపునిచ్చాడు. శ్రీరెడ్డి వంటివారితో చర్చలను గాని లేక పవన్ కళ్యాణ్ మాటలపై దాడి చేయడం గాని తగదని తను కూడా ఎబిఎన్ సహచరులకు చెప్పానని ఆర్కే అంటున్నారు. ఆమె తిట్టిన భాగాన్ని బీప్ శబ్దంతో ప్రసారం చేసినట్టు చూపిస్తున్నారు. పవన్‌ను తీవ్రంగా ఖండిస్తూనే ఛానళ్లు ఆ దుర్భాషలు ప్రసారం చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం చేయడం ఆసక్తికరం.
టీవీ9 యజమాని శ్రీనిరాజు ఇచ్చిన లీగల్ నోటీసుగా చెప్పబడుతున్న దాని పూర్తి పాఠం చూస్తే నిజంగా నోటీసు కాదు. హెచ్చరిక వంటిదే.ఇలాటి వ్యాఖ్యలకు అందరూ బాధపడతారని దాంట్లో సానుభూతి వెలిబుచ్చారు. తన ట్విట్లర్‌లోకి వచ్చి స్క్రీన్ షాట్స్ తీసుకున్నందుకు వాటిని మళ్లీ పోస్టు చేసినందుకు ఆయన లాయర్ సునీల్ రెడ్డి ద్వారా నోటీసు ఇప్పించారు. ఆ షాట్స్‌ను తీసేయాలని మాత్రమే నోటీసులో వుంది. కాకపోతే భవిష్యత్తులో తాను నోటీసు ఇచ్చే హక్కు తాను అట్టిపెట్టుకుంటున్నట్టు పేర్కొన్నారు. దీన్ని పవన్ తేలిగ్గానే తీసుకున్నారు. పైగా నోటీసు ఇచ్చిన న్యాయవాది వివాదాస్పద చరిత్రను జనసేన తవ్వితీసిందట. దాన్ని కూడా బహిర్గతం చేయబోతున్నారు. రవి ప్రకాశ్ సతీమణికి పవన్ ట్వీట్ చేయడం మాత్రం ఆయన అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. మీ పిల్లలను టీవీ9 చూడకుండాజాగ్రత్త పడండని అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత రవిప్రకాశ్ నుద్దేశించి మరో విడియో పోస్టు చేశారు. ఏడాది కిందట కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్‌ను ఆకాశానికెత్తి మాట్లాడిన రవికి ఆయనకూ ఇంత వైరుధ్యం ఎందుకు వచ్చిందంటే రాజకీయ కారణాలు తప్ప మరేమీ కనిపించడం లేదు. ముందు ముందు బయిటకు వస్తాయేమో తెలియదు. ఏమైనా ఈ ఉదంతాన్ని మరీ సాగదీయడంలో టివి9 విమర్శలకు గురైన మాట నిజమే. రవి స్వభావాన్ని బట్టి చూస్తే తను దీన్ని పెద్ద సవాలుగా తీసుకునే అవకాశం వుండదు. తీవ్రంగా స్పందించడమూ వుండకపోవచ్చు.ఆ విషయంలో తను ఆర్కేకు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. ఆర్కే స్పందన కూడా రాజకీయ వ్యక్తిగత కోణాల్లో ఎక్కువగా నడిచిందే తప్ప సంఘర్షణగా మార్చేట్టు కనిపించడం లేదు.ఇక ఈ జాబితాలో టీవీ5ను చేర్చడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. కేవలం లోకేశ్‌కు సన్నిహితుడైన వ్యక్తిపై కోపంతోనే పవన్ ఇలా చేశారన్న అభిప్రాయం వుంది. మహా టీవీ మూర్తి కూడా తను ఈ మొత్తం ఉదంతంలో ఎప్పుడు ఏం చేశారో ఒక విడియో ప్రసారం చేశారు గాని మిగిలిన వాటికి తనకూ తేడా వుంటుంది. పైగా తాము టిఆర్పిలో లేమని ఆయనే చెప్పేశారు. అయితే తన సలహా పాటించకుండా వెళ్లిపోయిన తారలు కొందరు పవన్‌కు తనపై చాడీలు చెప్పారని మూర్తి తెరపైనే వ్యాఖ్యానించారు. అందుకే ఆ ఉదంతం వేరుగా వుంటుంది.
మెగా బ్రదర్స్ ఎంతగానో ప్రయత్నించినా పరిశ్రమలో గాని మాలోగాని ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినట్టు కనిపిస్తుంది. పరిశ్రమ రెండుగా విడిపోయి నిలిచింది. కాని ఏది ఏమైనా సినిమాకూ మీడియాకు మధ్య సఖ్యత తప్పదనే వాస్తవికత అందరిలోనూ వుందని చెప్పొచ్చు.
ఈ రోజు కంపెనీ స్టార్స్ సదుపాయాలు పెంచాలని పరిశ్రమ పెద్దలు నిర్ణయం తీసుకోవడం ఒక సత్పలితం. మిగిలిన అంశాలపై కూడా ఏదో ఒక అవగాహన కుదరొచ్చు. శాశ్వత బహిష్కఱణలు మంచివి కావు. మీడియాధిపతుల స్పందనల్లో అందుకు అవకాశం అగుపిస్తుంది. రాజకీయంగా ఈ వైరం పెద్దది కావాలని కోరే వారు వుండొచ్చు గాని స్వాభావికంగానే అది కష్టసాధ్యం.దాసరి నారాయణరావును చాలా కాలం దూరం వుంచిన అగ్ర పత్రికా సంస్థ కూడా చివరకు సన్మానం చేయవలసి వచ్చింది. మీడియా ముందే వద్దనుకుంటే శ్రీరెడ్డి ఉదంతం ఇంతదూరం వచ్చేది కాదు. క్యాస్టింగ్ కౌచ్ సమస్యను అందరూ గుర్తించిన తర్వాత ఇలాటి వ్యక్తిగత మలుపులు తీసుకునేదీ కాదు. కాబట్టి ఇందులో దాగివున్న రాజకీయాలు మాత్రం అంత సులభంగా సమిసిపోవు. వివిధ రూపాల్లో వెంటాడుతూనే వుంటాయి. కాకపోతే అందరికీ మరింత జాగ్రత్త నేర్పుతాయేమో. పవన్ శిబిరం అందుకే ధీమాగా వుంది తప్ప దిగాలు పడిన సంకేతాలు లేవు.
— తెలకపల్లి రవి