తెలంగాణలో ఎవరు అధికారంలోకి వస్త్తారన్నది ఇప్పుడు ఎవరు కలిసినా అడిగే ప్రశ్న. ముఖ్యమంత్రి కెసిఆర్ తాను చాలా సర్వేలు చేయించానని 90 నుంచి 100 వరకూ వస్తాయని వివిధ దశల్లో చాలాసార్లు చెప్పారు.వారి మీడియాలోనూ అలాటి ప్రచారమే సాగుతున్నది. కాని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాత్రం అంతర్గతంగా మాట్లాడినప్పుడు అంత సీన్ లేదంటున్నారు. ఎలాగైనా అధికారంలోకి వస్తామని, ఇప్పుడున్న 60+ నిలబెట్టుకుంటామని వారంటున్నారు. ఒకవేళ యాభై వచ్చినా మజ్లిస్, బిజెపి తమకు మద్దతిస్తాయని టిఆర్ఎస్ భావిస్తున్నది. అలా చూస్తే ఖచ్చితంగా లెక్క వేసుకుంటున్నది యాభై మాత్రమే. మహాకూటమి తరపున చంద్రబాబు ఎక్కువగా ప్రచారం చేస్తే తమకు మంచిదని అప్పుడు ఆయనపై వ్యతిరేకత రెచ్చగొట్టి తమ ఓట్లు సీట్లు పెంచుకోవచ్చని టిఆర్ఎస్ ఆశిస్తున్నది.
తమాషా ఏమంటే కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇలాగే వుంది. కనీసం తమకు 40 మిత్రులకు మరో 15 వస్తాయని కాంగ్రెస్ వారు చెబుతుంటారు. అయితే నిశితంగా ప్రశ్నిస్తే ఆలస్యం, అనైక్యత వంటి కారణాలు చూపించి ఎలాగో 25 సీట్లతో గతంలో కన్నా కొద్దిగా పెరుగుతామని అంటున్నారు. టిజెఎస్‌కు అసలే నమ్మకం లేదు. టిడిపి మాత్రం బలమైన సీట్లు వస్తే 6 లేదా 7 తెచ్చుకోగలమంటుంది. బిజెపి 60+ అనడం జోక్‌గా తీసుకుంటున్నారు. రెండుమూడు చోట్ల మాత్రం ఎలాగో టిఆర్ఎస్ వారే బిజెపిని గెలిపించే బాధ్యత తీసుకున్నారు.ముషీరాబాద్‌లో బిజెపి లక్ష్మణ్ కోసమే హోంమంత్రి నాయని అల్లునికి లేదా ఆయనకు టికెట్ నిరాకరించారన్నది జనవాక్యం. ఇక సిపిఎం బిఎల్ఎప్లు అన్ని చోట్టా పోటీ చేస్తామంటున్నా గెలిచే స్థానాల సంఖ్యపై పెద్దగా ఆశలు కల్పించడం లేదు. మజ్లిస్‌కు గతంలో వచ్చిన ఏడు కన్నా ఎక్కువగా వస్తాయా అంటే అదే గరిష్టమనీ, మహా కూటమి కొన్నిచోట్ల వారి ఓట్టు చీల్చవచ్చని పరిశీలనలు చెబుతున్నాయి.