జగన్పై జరిగిన దానికి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం, స్వయంగా ముఖ్యమంత్రి అఫెన్సు డిఫెన్సు కూడా అతిగా వున్న సంగతి చెప్పుకున్నాం. వైసీపీ వైఖరిలోనూ తీవ్రలోపాలే వున్నాయి. వీటిని పదేపదే విమర్శించిన తర్వాత ఆలస్యంగానైనా రెండు పార్టీలు దిద్దుబాటు సర్దుబాటు ప్రారంభించాయి. టిడిపి వరకూ చూస్తే దాడి జరిగిన వెనువెంటనే అంతగా మాట్లాడి దాన్ని సమర్థించుకోవడం కోసం మరింత దూరం వెళ్లి లేనిపోని ప్రచారం కల్పించామనే విచారం మొదలైందట. నోటి దూకుడుకు మారుపేరైన రాజేంద్ర ప్రసాద్ మరీ విపరీతంగా జగన్సోదరి షర్మిల తల్లి విజయమ్మ ఈ దాడి చేయించివుంటారని ఆరోపించడం దీనికి పరాకాష్టగా మారింది. టిడిపి నేతలనే దిమ్మెర పోయేలా చేసింది. విమానాశ్రయం పూర్తిగా సిఐఎస్ఎప్ అధీనంలో వుంటుంది గనక మాకేం సంబంధమని తాము చేసిన వాదన వైసీపీ నేతలు కేంద్రం దగ్గరకు వెళ్లడానికి ఉపయోగపడిందని గమనించి అలా అనలేదంటూ మరో సర్దుబాటు మొదలెట్టారు. కెసిఆర్ మాట్లాడారని తప్పు పట్టేబదులు మీరే ముందు మాట్లాడివుండాల్సిందంటూ వచ్చిన వ్యాఖ్యలపై కూడ చంద్రబాబు తాను ప్రయత్నం చేశానంటూ వివరణ మొదలెట్టినట్టు కనిపిస్తుంది. జగన్కు తగిలింది చిన్న గాయం అని ఒకటికి రెండు సార్లు హేళన చేసిన టిడిపి నేతలకు తమ ప్రభుత్వ పోలీసులే హత్యాప్రయత్నం అని రిమాండు రిపోర్టు రాయడంతో గొంతులో వెలక్కాయ పడింది.తాజాగా పోలీసు కమిషనర్ లడ్డా నిందితుని ఉద్దేశం వంటివాటిపై అప్పుడేమాట్లాడ్డం పద్ధతి కాదని చెప్పడంతో మరి డిజిపి ఎప్పుడో చెప్పారు కదా అని ఆశ్చర్యపోవలసి వచ్చింది. నిందితుడిని ప్రైవేటు వైద్యుడికి చూపించామని కూడా విశాఖ పోలీసులు వెళ్లడించడంతో జగన్ మరోచోటికి వెళ్లి చూపించుకోవడంపై ప్రభుత్వం పాలక పక్షం చేసిన తీవ్ర దాడి సరైంది కాదని తేలిపోయింది.
ఇదే విధంగా వైసీపీ నేతలు కూడా కొన్ని సవరణలు చేసుకున్నారు. తాము రాష్ట్రపతి పాలన కోరలేదని ఒక వివరణ ఇచ్చారు. ఏదైనా మూడవ పక్షం దర్యాప్తు చేయాలని మాత్రమే అడిగామన్నారు. ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నవారు కొంతమంది పై వారిని దృష్టిలో పెట్టుకుని మొత్తం ఎపి పోలీసు వ్యవస్థపై అవిశ్వాసం వ్యక్తం చేసి వుండాల్సింది కాదని నేను చాలాసార్లు వ్యాఖ్యానించాను. మాకు వ్యవస్థపై పూర్తి గౌరవం వుందని జగన్ గారు చెప్పమన్నారని ఈ రోజు శ్రీకాంత్ రెడ్డి మీడియాముందు చెప్పారు.
ఆ మాటకొస్తే గరుడ పురాణ కర్త శివాజీ కూడా మొన్న నా ప్రశ్నల తర్వాత కొంచెం గొంతు మార్చారు. రెండవ దశలో చంద్రబాబుకు ముప్పు గురించి మాత్రమే చెప్తూ వచ్చిన వ్యక్తి ఇప్పుడు మళ్లీ మొదట్లోలా అందరి గురించి మాట్లాడుతున్నారు.