నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ గురించి ఎక్కువగా మాట్లాడ్డం నాకు ఇష్టం లేకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మొత్తం టిడిపి నేతలు మాట్లాడుతున్నారు గనక పరిశీలించక తప్పడం లేదు. జాగ్రత్తగా చూసిన కొద్ది ఇది పొంతన లేని అతుకుల బొంతగా స్పష్టమై పోతుంది. ఇంకా చెప్పాలంటే టిడిపి నేతల ప్రస్తుత వాదనలకు వ్యతిరేకమైన అంశాలు కూడా దానిలో వున్నాయి. ప్రధానంగా పవన్ కళ్యాణ్‌పై దాన్ని ఎక్కుపెట్టినట్టు కనిపిస్తుంది.
దీని గురించి 2017 అక్టోబరులో మొదటిసారి నా ఇంటర్వ్యూలోనే చూచాయగా చెప్పారు. అప్పటికి ఆయన టిడిపిపై విమర్శకులుగా వున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కరే ప్రత్యేక హోదా కోసం పోరాడగలరని అన్నారు. బిజెపి ఎపిని అల్లకల్లోలం చేయాలనుకుంటుంది గనక మాట్లాడుతున్నానని తన నాయకులందరూ బాగుండాలని జగన్‌ను ఉద్దేశించి కూడా వ్యాఖ్యానించారు. ఆ ఇంటర్వూ ఇప్పుడు కూడా యూ ట్యూబ్‌లో వుంది.తర్వాత పరిస్థితులు మారాయి. టిడిపి ప్రత్యేక హోదాపై మాట్లాడక తప్పని స్తితి ఏర్పడింది. ఎన్‌డిఎ నుంచి బయిటకు రాబోతున్న సూచనలు కనిపించాయి. అప్పటి నుంచి శివాజీ స్వరంకొంత మారింది. 2018 మార్చిలో నా ప్రస్తావన కూడా చేస్తూ ఆయన ఆపరేషన్ గరుడ పేరిట బోర్డుపై రాసి మరీ ఈ కథనం విడుదల చేశారు. ప్రేమకు వేళాయరా చిత్రంలో సూర్య ఒక అక్క, ఒక బావ, ఒక హీరో, ఒక విలన్ అన్నట్టు ఒక జాతీయ పార్టీ, ఒక రాష్ట్ర అధికారపక్షం, ఒక కొత్త నాయకుడు, (కసులు వున్న) మరో ముఖ్యమైన పార్టీ నాయకుడు అంటూ కథ చెప్పారు. పేర్లు చెప్పడానికి తనకు సమస్యలున్నందున మననే అర్థం చేసుకోవాలని అన్నారు. ఇంత చెప్పాక ఈ పార్టీల నాయకుల పేర్లు తెలుగు నాట చిన్న పిల్లలైనా వూహించుకోగలుగుతారు గనక శివాజీ చెప్పేది బిజెపి,టిడిపి,వైసీపీ,పవన్ కళ్యాణ్‌ల గురించేనని అందరికీ అర్థమైంది.
ఈ కథలో శివాజీ చెప్పే ప్రకారం జాతీయ పార్టీ రాష్ట్ర అధికార పార్టీపై అనేక సంస్థల ద్వారా దాడి చేస్తుంది. కొత్త నాయకుడు ఏదో కనిపెట్టేవాడిలాగా బయిలుదేరతాడు. మాజీ ఐఎఎస్‌లు, ఇతరులు తనను నమ్మి చేరతారు. ఒక సీనియర్ పాత్రికేయుడు కూడా కలుస్తాడు. వాస్తవానికి ఈ మాజీ అధికారులే రాష్ట్ర అధికార పార్టీపై దాడికి కేసులు తవ్వితీసేందుకు ఢిల్లీలో వుంటారు.(ఇప్పటికే వున్నారని కూడా చెప్పారు) కొత్త నాయకుడి గురించి జాతీయ పార్టీ గురించి తెలియకుండా ఇవన్నీ చేసిన వారు బలిపశువులవుతారు. ఈ కొత్త నాయకుడు ఏదో చేస్తాడని నమ్మి తను కూడా చాలాకాలం ఎదురు చూశానని శివాజీ అంటారు. చివరగా మరో ముఖ్యమైన పార్టీ నాయకుడిని తనకే తెలియకుండా కేసులు తీసేసేే ఆశతో జాతీయ పార్టీయే కలిసే అవకాశం కల్పిస్తుంది. వాస్తవానికి అసలైన బలిపశువులు వీరేనని శివాజీ ఒకటికి రెండు సార్లు చెబుతారు. ఈ నాయకుడిపై ప్రాణాపాయం లేకుండా దాడి జరుగుతుంది. అప్పటికే రెండుసార్లు రెక్కీలు చేశారు.మూడోసారి దాడి తర్వాత బీహార్ యుపి గ్యాంగులు వచ్చి అల్లకల్లోలం సృష్టిస్తాయి. అప్పుడు జాతీయ పార్టీ రాష్ట్రంలో అధికార పార్టీని కూలదోస్తుంది. ఇది ఆపరేషన్ గరుడ సారాంశం. 2018 మార్చిలో టిడిపి బయిటకు వచ్చే సమయంలో శివాజీ ఈ విడియో విడుదల చేశారు. నాతో మాట్లాడిన తరుణంలో టిడిపిపై విమర్శకుడుగా వున్న ఆయన అప్పటికి ఆ విమర్శలు మానేశారు. నా జగన్ నా పవన్ నా రాష్ట్రం అన్నది కాస్త నా ప్రభుత్వంగా మారింది. గరుడను శివాజీ కన్నా టిడిపివారే ఎక్కువగా భుజాన మోయడం మొదలెట్టారు.
కొద్దివారాల కిందట శివాజీ మరోసారి మీడియా ముందుకు వచ్చి గరుడ మొదలైందన్నట్టు కేంద్ర సంస్థలు దాడికి రాబోతున్నాయన్నారు. అప్పుడే చంద్రబాబుకు మహారాష్ట్ర కోర్టు సమన్లు రావడంతో ఇది దాంట్లో భాగమన్నారు. నిజానికి అవి చాలా కాలం నుంచి వస్తున్నవే. పైగా తర్వాత కూడా పెద్ద సమస్యగా మారలేదు కూడా. ఐటి దాడుల బృందాలు రావడం కూడా అదేనన్నారు. జగన్‌పై దాడి జరగ్గానే ఆ వివరాలకు మించి కొన్ని మీడియాలు శివాజీ పురాణం ప్రసారం ప్రారంభించాయి. చంద్రబాబు ఢిల్లీ మీడియా వరకూ దాన్ని చేర్చారు.
ఇప్పుడెవరైనా శివాజీ విడియో చూడండి. దాంట్లో చెప్పిన ప్రకారం జగన్, వైసీపీ నేతలు బలిపశువులా? లేక టిడిపి అంటున్నట్టు కుట్రలో భాగమా? ఐటిదాడులు సిబిఐ కేసులు గతంలో లేవా? ఇక జగన్ కన్నా పవన్నే కుట్రదారుగా భావిస్తున్నారా టిడిపి నేతలు? జగన్‌ఫై దాడి తర్వాత బిహార్ గూండాలు రాలేదే? అసలు ఆయన చెప్పిన సెప్టెంబరు 1 ఏమీ జరగలేదే? వీటికి ఏమంటారు?
మీరు చెప్పినట్టు జగన్ బలిపశువా లేక కుట్రలో భాగమా అని నేను టివి5లో శివాజీని అడిగాను. సూటిగా చెప్పలేదు.నేను ఎవరి పేర్లు చెప్పలేదని దాటేయబోయారు.మీరే వూహించుకోమన్నారు గదా అన్నాను. గతంలో ఎపి తరపున అన్న మీరు ఇప్పుడు టిడిపి ప్రభుత్వానికి పరిమితమవుతున్నారే అంటే ఇప్పటికీ ఆ విమర్శలకు కట్టుబడి వున్నానంటారు. చంద్రబాబుపై అరోపణలుంటే లోపల వేయొచ్చు గాని కుట్రలు వద్దంటారు. కొత్తగా చెప్పిందేమంటే టిడిపిలో చాలా మంది కోవర్టులున్నారనీ, ఒక టిడిపి నాయకుడే వైసీపీని బిజెపితో కలిపారని వెల్లడించారు. మరి వీటిపై టిడిపి ఏమంటుందో తెలియదు. గరుడ విషయాలు ఏడాదిగా తెలిసినా చర్యలు తీసుకోని చంద్రబాబు ఇప్పుడు తమ పార్టీలోనే కుట్రదారులున్నారన్న గరుడ పురాణంపై దృష్టి పెడతారా? జగన్ కష్టపడుతున్నాడు గనక ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతాడని కూడా శివాజీ చెబుతున్నది టిడిపి వారు జీర్ణించుకోగలరా? లేరు గనకనే ఆంధ్రజ్యోతి ఆ శీర్షికతో వార్త నిచ్చింది. సుదీర్ఘమైన అనుభవం గల చంద్రబాబు తాడూ బొంగరం లేని శివాజీ కథను వల్లెవేసే బదులు తమ తప్పొప్పులు సమీక్షించుకుని సరైన విధానంతో అందరినీ కలుపుకుని రాష్ట్రం కోసం పోరాడాలి. శివాజీ కథనం కొత్తనాయకుడు అంటే పవన్‌కు వ్యతిరేకంగానే ఎక్కువగా ఎక్పుపెట్టడానికి కారణం ఏమిటో కూడా ఆలోచించడం అవసరం. కాదంటే నేను చాలా సార్లు అన్నట్టు గరుడ వ్యవహారాల మంత్రిగా శివాజీని నియమించుకుంటే ఒకపనై పోతుంది.
ఇలాటి కథల వల్ల బిజెపి గొప్ప వ్యూహంతో ఎపిని కూడా కైవశం చేసుకుంటుందనే వాతావరణం ఏర్పడుతుందని కూడా ఏలిన వారు గుర్తించాలి.
-తెలకపల్లి రవి