తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌పై… ప్రభుత్వ ఉన్నతాధికారులంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. సెక్రటేరియట్‌ను.. బలవంతంగా ఖాళీ చేయించి… ఇబ్బంది పెడుతున్నారనే అభిప్రాయానికి వారు వస్తున్నారు. తాత్కలిక భవనాన్ని సరైన ఏర్పాట్లు చేయకుండానే తొలగింపు ఆదేశాలివ్వడం వారిని మరింత ఇబ్బంది పెడుతోంది. తాత్కాలిక సెక్రటేరియట్ బూర్గుల భవన్లో కనీస సౌకర్యాలు లేవని.. అధికారులు అసంతృప్తిలో ఉన్నారు. అరకొర వసతుల మధ్యే సెక్రటేరియట్ తరలింపు ప్రక్రియ జరుగుతోంది. తరలింపు కోసం ఉద్యోగుల సెలవులను కూడా రద్దు చేశారు..
తెలంగాణా ప్రభుత్వం ఎంత వేగంగా సెక్రటేరియట్ ను తరలించాలని అనుకున్నా వీలు కావడం లేదు..ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతోంది. ఇప్పటికే సెక్రటేరియట్ కూల్చివేత,తరలింపుపై కేసులు దాఖలు కావడంతో ప్రక్రియ ఆలస్యమైంది. కేసులు వెంటనే తేలిపోతాయని భావించిన ప్రభుత్వం భూమి పూజ తర్వాత కొద్ది రోజులు ఎదురు చూసింది. కేసు విషయం తేలే లోగా సెక్రటేరియట్ తరలింపు పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా బూర్గుల భవన్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను హడావుడిగా ఖాళీ చేసి మరో చోటికి పంపారు. బిఆర్కే భవనం ఖాళీ కాగానే అందులోకి వెంటనే సెక్రటేరియట్ తరలిస్తున్నారు.
బీఆర్కేభవన్లో ఏ ఫ్లోర్ లోనూ సరైన వసతులు లేవని గుర్తించి ప్రతీ ఫ్లోర్ మరమ్మత్తులు, విద్యుద్దీకరణ,కలర్స్ కోసం 20 లక్షలు కేటాయించారు. పనులు చేస్తున్నప్పటికీ.. బిఆర్కే భవన్ కు వెళ్లిన ఉద్యోగులు అక్కడి పరిస్థితి చూసి షాకవుతున్నారు. సౌకర్యాలు కల్పించే వరకూ వెళ్లలేమని చెప్తున్నారు. టాయిలెట్లు,డ్రైనేజీ పైపు లైన్లు,లిఫ్లులు,కలరింగ్ పూర్తి కావడానికి మరో నెల రోజులకు పైగా సమయం పడుతుందని అంటున్నారు.ఇవన్నీ పూర్తయ్యాక ఇంటర్నెట్,కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తి చేయడానికి కనీసం 45 రోజుల సమయం కావాలని ఐటి శాఖ చెప్తోంది. ఈ గందరోగళం మధ్య.. తరలింపుపై తీవ్రమైన ఒత్తిడి వస్తూండటంతో… ఉన్నతాధికారుల్లో అసంతృప్తి ప్రారంభమయిందంటున్నారు.