తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. 58 ఏళ్ల పాటు పోరాడి జనం సొంత రాష్ట్రం సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆషామాషీగా సాగలేదు. దశాబ్దాల పోరాటం. అంతకు మించి ఎన్నో ప్రాణాల త్యాగ ఫలితం. 1968లో తొలి సారిగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమయింది.
రెండో దశ ఉద్యమాన్ని ప్రారంభించిన కేసీఆర్ !
తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు ద్వారా కేసీఆర్ ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ సాధనే లక్ష్యంగా ఇరవై ఏళ్ల కిందట హైదరాబాద్లోని జలదృశ్యంలో పార్టీ ప్రకటన చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ను సిద్ధాంతకర్తగా పెట్టుకుని పోరాటం ప్రారంభించారు. . 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారు. అక్కడ నుంచి తెలంగాణ ఉద్యమం తీవ్రం అయింది. కేసీఆర్ చేపట్టిన దీక్ష సకల జనులను కదిలించడంతో డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు చేస్తామని కేంద్రం చేసిన ప్రకటన చేసింది. అయితే తర్వాత వెనక్కి తగ్గింది. ఎన్నికలకు ముందు 2014 జూన్ 2న తెలంగాణను ఏర్పాటు చేశారు.
ఎనిమిదేండ్లలో పురోగమించిన తెలంగాణ !
ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తెలంగాణ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటోందని అప్పట్లో నిపుణులు విశ్లేషించారు. తెలంగాణలో కరెంట్ ఉత్పత్తి తక్కువ కావడంతో కరెంట్ సమస్య నుంచి అనేక రకాల సమస్యలు వస్తాయని అంచనా వేశారు. కానీ ఎనిమిదేళ్లలో తెలంగాణ అద్భుతంగా పురోగమించింది. 2015 -16 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక వృద్ధి రేటు 11 శాతం కంటే ఎక్కువగా ఉంది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అంటే.. ఉమ్మడిగా ఉన్న ఆ ఆర్థిక సంవత్సరం మినహా మిగిలిన ఆర్థిక సంవత్సారాల్లో ఆర్థిక వృద్ధి 11 శాతానికి పైగా ఉంది. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత తెలంగాణ జీఎస్డీపీ ఏడేళ్లలోనే రెట్టింపు అయింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తెలంగాణ 18.5 శాతం అద్భుత ప్రగతి సాధిస్తోంది. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4 శాతం ఉండగా ఇది 5 శాతానికి పెరిగింది. తలసరి ఆదాయంలో తెలంగాణలో దేశంలోనే ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు పదకొండో స్థానంలో ఉండేది.
ధాన్యం ఉత్పత్తి పెరుగుదల !
ధాన్యం ఉత్పత్తి ఎనిమిదేళ్లలో అయిదు రెట్లు పెరగింది. అంటే సాగునీటి లభ్యత పెరిగిందని అర్థం. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పెండింగ్లోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటి కార్యాచరణతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి జరిగింది. అనితర సాధ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. నల్లగొండ ఫ్లోరోసిస్ సమస్య తీరిపోయింది.
ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం !
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల మూలస్తంభాల మీద నడిచింది. నీళ్లు, నిధుల విషయంలో ఎలాంటి సమస్యా లేదు. కానీ నియామకాల విషయంలో మాత్రం ఇంకా తెలంగాణ యువతలో అసంతృప్తి నెలకొంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నత్త నడనక సాగుతోంది. ధనిక తెలంగాణలో ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. అప్పులు ఇబ్బడిమబ్బడిగా చేయడంతో ఇప్పుడు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటోంది. తెలంగాణ ప్రభుత్వంపై కుటుంబ పాలన విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అన్ని వ్యవస్థలను ఒకే కుటుంబం నియంత్రిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.