ఓటుకి నోటు కేసు మళ్ళీ ఊహించని విధంగా పైకి వచ్చింది. ఈ కేసుని పాత చార్జ్ షీట్ ఆధారంగానే పునర్విచారణ జరిపేందుకు అనుమతించాలని కోరుతూ ఈరోజు తెలంగాణా ఏసిబి అధికారులు ఏసిబి కోర్టులో ఒక మెమో దాఖలు చేశారు. వారి అభ్యర్ధనని మన్నించిన కోర్టు 15/16 నెంబరుతో ఈ కేసుని నమోదు చేసేందుకు అనుమతించింది.
ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాత్ర గురించి కూడా దర్యాప్తు చేసి సెప్టెంబర్ 29న జరిగే తదుపరి విచారణలోగా కోర్టుకి నివేదిక అందజేస్తామని ఏసిబి అధికారులు తెలిపారు. అనంతరం, ఈ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొనబడిన రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహ ముగ్గురికీ ఏసిబి కోర్టు నోటీసులు జారీ చేసింది. ముగ్గురినీ సెప్టెంబర్29న కోర్టుకి హాజరు కావాలని ఆదేశించింది.
ఇదే సమయంలో ఇదే కేసుకి సంబంధించి హైకోర్టులో కూడా మరో ఆసక్తికరమైన పరిణామం జరిగింది. ఈ కేసులో నాలుగవ నిందితుడుగా పేర్కొనబడిన జెరూసలెం మత్తయ్య కొన్ని రోజుల క్రితం హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు. దానిలో తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధమూ లేదని కనుక తనకి ఈ కేసు నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ అభ్యర్ధించారు. అతని వాదనలతో ఏకీభవించిన హైకోర్టు అతనికి ఈ ఓటుకి నోటు కేసు నుంచి విముక్తి కల్పించింది. కానీ అప్పుడు ఈ కేసుతో సంబంధం ఉన్న టిఆర్ఎస్ నామినేటడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కోర్టుకి హాజరు కావలసిఉన్నా కాలేదు. అందుకు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు సెప్టెంబర్ 30వ తేదీలోగా పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశిస్తూ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై ఆయన బెయిల్ పొందే అవకాశం కల్పించింది.