సాక్షాత్ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. టాకూర్ హామీ ఇచ్చినా కూడా తెలంగాణా న్యాయవాదులు సమ్మె కొనసాగించడానికే నిర్ణయించుకొన్నారు. న్యాయవాదుల సంఘాల నేతలు నిన్న డిల్లీలో టి.ఎస్. టాకూర్ ని కలిసినప్పుడు, ముందు సమ్మె విరమించి విధులలో చేరితే, వారి సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తన మాటకి గౌరవమిచ్చి సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దానిపై వారు చర్చించుకొన్న తరువాత తమ డిమాండ్లన్నీ నెరవేరేవరకు సమ్మె కొనసాగించడానికే నిర్ణయించుకొన్నామని గవర్నర్ నరసింహన్ని కలిసి తెలియజేశారు. సమ్మె విరమించమని గవర్నర్ చేసిన విజ్ఞప్తిని కూడా వారు తిరస్కరించారు.
దీనితో పరిష్కారం అయ్యే అవకాశమున్న ఈ సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. న్యాయవాదులు సమ్మె కొనసాగిస్తుండగా తాను ఈ వ్యవహారంలో కలుగజేసుకోలేనని జస్టిస్ టి.ఎస్. టాకూర్ నిన్ననే చెప్పారు. సాక్షాత్ భారత ప్రధాన న్యాయమూర్తి మాటనే తెలంగాణా న్యాయవాదులు గౌరవించనప్పుడు, వారి సమస్యల పరిష్కారం కోసం ఆయన చొరవ తీసుకొంటారని ఆశించలేము. ఈ సమస్యని చట్టప్రకారమే హ్యాండిల్ చేయాలని ఆయన భావిస్తే ఇంకా చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక ఈ సమస్యని పరిష్కరించే బాధ్యత కేంద్రానికే అప్పగించవచ్చు. ఈ సమస్యని కేంద్రప్రభుత్వం లేదా ఏపి, తెలంగాణా ప్రభుత్వాలకి పరిష్కరించే ఉద్దేశ్యమే ఉండి ఉంటే అవి ఇంతకాలం సాగదీసి ఉండేవి కావు. భారత ప్రధాన న్యాయమూర్తి వారి సమస్యలని పరిష్కరిస్తానని హామీ ఇచ్చినపుడు ఆయన మాటకి విలువిచ్చి సమ్మె విరమించి విధులలో చేరి ఉండి ఉంటే ఆయనకి, వారికీ కూడా చాలా గౌరవంగా ఉండేది. కానీ సమ్మె కొనసాగించాలనుకోవడం ద్వారా తెలంగాణా న్యాయవాదులు ఒక సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకోవడమే కాక తమ సమస్యని తామే ఇంకా కొనసాగిస్తూ ఇంకా జటిలం చేసుకొంటున్నారు. కనుక ఈ సమస్య ఇంకా ఎప్పటికి పరిష్కరించబడుతుందో..ఆలోగా ఇంకా ఎటువంటి విషపరిణామాలు తలెత్తుతాయో ఎవరూ ఊహించలేరు.