ఏపీ ప్రభుత్వం మటన్ మార్టుల పేరుతో ఓ కాన్సెప్ట్‌ను తమ అధికార మీడియా ద్వారా ప్రజలకు తెలియచెబితే జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి పశుసంవర్థక మంత్రి అలాంటి ఆలోచనలేదని. అలా ప్రచారం చేసింది ఎల్లో మీడియా అని విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు అదే ఆలోచన తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది. ప్రత్యేకంగా మటన్ మార్టులు అని పేరు చెప్పకపోయినా మటన్ దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని దాదాపుగా నిర్ణయించారు.
ప్రభుత్వమే ప్రతి జిల్లాలో ఒకటి లేదా రెండు వధశాలలు ఏర్పాటు చేయాలని ఫ్లాన్ చేస్తోంది. వీటిని స్థానిక మటన్ షాపులకు లింక్ చేస్తారు. అక్కడి నుంచి వినియోగదారులు కొనుక్కెళ్లవచ్చు. మటన్ దుకాణాల యజమానులు కూడా ప్రభుత్వం సరఫరా చేసే మటనే అమ్మాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలు ఇప్పటికే రెడీ అయ్యాయి ప్రభుత్వం తుది అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం మేకలు, గొర్రెల యూనిట్లను పెద్ద ఎత్తున లబ్దిదారులకు సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. వాటి వల్ల భారీగా ఉత్పత్తి ఉండనుంది.
తెలంగాణ ప్రజల అవసరాల మేరకే ప్రభుత్వం పంపిణీ చేసిన మేకలు, గొర్రెల పథకం ఉపయోగపడాలని.. ఎక్కువ అయితేనే ఎగుమతి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఆ యూనిట్ల లబ్దిదారులకు మెరుగైన రేట్లు వచ్చేలా చూడటం.. ప్రజలకు పరిశుద్ధమైన మటన్ అందేలా చూసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గినా తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం లేదు.