ఎపి తెలంగాణ విభజన జరిగి రెండేళ్లు గడిచినా ఎందుకుని వివాదాలు కొనసాగుతూనే వున్నాయి? హైకోర్టు నదీజలాలు వంటివి సరే-చాలా సులభంగా పంచుకోగలిగిన తేల్చుకోగలిగిన పదోషెడ్యూలులోని సమస్యలు కూడా ఎందుకు కొనసాగుతున్నాయి? దీనిపై తెలంగాణ సర్కారు సమాధానం ఆసక్తిగా వుంది. పదోషెడ్యూలులోని సంస్థలపై ఏదో ఒక పరిష్కారం చేసుకోవడం పెద్ద సమస్య కాదు. వాటిలో కొన్ని మాత్రమే నిజంగా కీలకమైనవి. ఎక్కువ భాగం తేలిగ్గా తేల్చుకోవచ్చు. ఎపి ప్రభుత్వం కూడా వాటిని ఎలాగో పంచుకుని ఎంతో కొంత తీసుకుని వెళ్లిపోదామనుకుంటున్నది. మాకూ అదే భావం వుంది అంటున్నారు. మరైతే ఎందుకు ఆలస్యమవుతుంది ?
ఎందుకంటే ఇంతకంటే పెద్ద సమస్యల పరిష్కారానికి ఇవి ఒక కవచంగా వుంటున్నాయి. ఉదాహరణకు హైకోర్టు, నదీజలాల వంటి సమస్యల్లో ఎపి సర్కారు ఇబ్బందులు పెట్టొచ్చు. మేము అన్నీ సజావుగా ముగించేస్తే వారు అస్సలు మాట వినరు. ప్రధాన సమస్యలు తేలేవరకూ ఎన్ని వివాదాలు కొనసాగుతుంటే అంత మంచిది. పులిచింతల నిర్వాసితులకు పరిహారంపై కూడా ఒత్తిడి పెంచుతాము. పెద్ద సమస్యలు తేలితే పదో షెడ్యూలు సంస్థలు పదినిముషాల్లో పంచేసుకోవచ్చు అని ఒక నాయకుడు వివరించారు.
ఎపి వైఖరి కూడా ఇంతకంటే పెద్ద భిన్నంగా లేదు. పదో షెడ్యూలులో నిజంగా పనికి వచ్చేవి పదిపదిహేను కన్నా లేవని కీలకమైన పదవిలో వున్న ఒక నిపుణుడు వ్యాఖ్యానించారు. వాటి గురించి వూరికే వెంటపడటం వృథా. కొన్ని మూత వేసేవే.పైగాప్రభుత్వ సంస్థలంటే మాకెలాగూ పెద్ద ప్రాధాన్యత లేదు. వాటిలో ఏ కాస్త నిధులో వచ్చాయని నిర్వహణ నెత్తికెత్తుకోలేము. ఏదో ఒక విధంగా వివాదం నడుస్తుంటే మాకు ఓపికవచ్చినప్పుడే పరిష్కారం చేసుకుంటాము. పైగా ఎక్కువ సంఖ్యలో సమస్యలు వుండడం కూడా సానుభూతి కలిగిస్తుంది కదా అని ఆయన వివరణ. బాగుంది కదా ఇద్దరి లాజిక్