ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణను కేంద్రం ఆదేశించింది. అయితే ఇది ఏకపక్ష ఆదేశం అని.. తమ వాదన ఎందుకు వినలేదని తెలంగాణ ప్రశ్నిస్తోంది. ఏపీనే తమకు రూ. పన్నెండు వేల కోట్లకుపైగా ఇవ్వాలని అంటోంది. కేంద్రం ఈ లెక్కలను ఎందుకు చూడటం లేదని ప్రశ్నిస్తోంది.
తెలంగాణ చెబుతున్న బాకీలు !
ఏపీ ఉద్దేశపూర్వకంగానే పీపీఏలను పట్టించుకోకుండా.. థర్మల్ విద్యుత్తును తెలంగాణకు సరఫరా చేయకుండా నిలిపివేసింది. ఆ లోటును పూడ్చుకునేందుకు బహిరంగ మార్కెట్లో విద్యుత్తును తెలంగాణ కొనుగోలు చేసింది. దీనివల్ల కలిగిన అదనపు భారానికి సంబంధించి బకాయిలు … అలాగే జల విద్యుత్తు , మాచ్‌ఖండ్, టీబీ డ్యాం విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల తెలంగాణకు అయిన అదనపు ఖర్చు వడ్డీతో కలిపి రూ.6639 కోట్లు ఉంటుందని తెలంగాణ విద్యుత్ సంస్థలు ప్రకటించాయి. అలాగే రాష్ట్ర విభజన సమయంలో అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించి ఏపీ డిస్కంల నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలు వడ్డీతో కలుపుకొంటే.. రూ.3,819 కోట్లు ఉన్నాయి. అలాగే పవర్ పర్చేజ్‌కు సంబంధించి ఏపీ డిస్కంల నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలకు రూ.6,639 కోట్లు చెల్లించాలి. ఏపీ ట్రాన్స్‌కో నుంచి రూ.1,730 కోట్లు రావాలి. దీనితోపాటు ఏపీ జెన్కో నుంచి తెలంగాణకు రూ.4,026 కోట్లు రావాలని చెబుతున్నారు. ఇక కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రూ.1,614 కోట్లు ఇవ్వాలి. ఇవన్నీ కలుపుకుని.. ఏపీకి ఇవ్వాల్సిన వాటినీ తీసేస్తే.. రూ.12 వేల కోట్ల కంటే ఎక్కువే ఇవ్వాలని తెలంగాణ వాదిస్తోంది.
ఆ బకాయిలు వేరు.. ఇవి వేరంటున్న ఏపీ ప్రభుత్వం !
తెలంగాణ చెబుతున్న లెక్కలతో ఏపీ ప్రభుత్వం ఏకీభవించడం లేదు. విభజన చట్టం ప్రకారం ఇచ్చిన విద్యుత్‌కు చెల్లింపులు చేయాలని.. ఇతర ఖాతాలు ఏమైనా ఉంటే విడిగా చూసుకోవాలని చెబుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన మొత్తాన్ని విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఎలా కలుపుతారని ప్రశ్నిస్తోంది. తెలంగాణకు ఏమైనా రావాలంటే .. ముందుగా ఇవ్వాల్సిన వాటిని ఇచ్చిన తర్వాతే చర్చించాలని అంటోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం వద్ద ఏపీ సర్కార్ తమ పలుకుబడిని ఉపయోగించింది. తెలంగాణ సర్కార్‌కు లేఖ పంపించేలా చేసింది.
రెండు రాష్ట్రాల వివాదమని కొన్నాళ్ల కిందట పార్లమెంట్లో చెప్పిన కేంద్రం !
తెలంగాణ …ఏపీకి ఉన్న విద్యుత్ బకాయిలపై ఏంచేశారని విజయసాయిరెడ్డి గత పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం కోర్టుకెళ్లిందని విషయం కోర్టులో ఉన్నందున రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించుకుని సమస్యనుపరిష్కరించుకోవాలని కేంద్రమంత్రి పార్లమెంట్లో సూచించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా కేంద్రం.. తెలంగాణ బిల్లులు చెల్లించాలని ఆదేశించింది. దీంతో రెండు రాష్ట్రాలతో పాటు ఈ పంచాయతీలోకి కేంద్రం కూడా వచ్చినట్లయింది. కేసీఆర్ ఈ అంశంపై రాజకీయంగా ఎలా స్పందిస్తారన్నదే కీలకం.