సముద్రంలోకి గోదావరి నీళ్లు వేల క్యూసెక్కులు వృధాగా పోతున్నాయని వాటిని ఉపయోగించుకోవడానికి .. రాయలసీమకు తరలించడానికి బకనచర్ల ప్రాజెక్టు గురించి ప్రతిపాదన పెట్టారు. ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై తెలంగాణ అభ్యంతరం చెబుతోంది. దానికి అనుమతుల్లేవని సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. వెంటనే అధికారికంగా తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను ఏపీ సీఎస్‌కు పంపాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. పనిలో పనిగా పోలవరం పైనా నివేదిక అడిగారు. పోలవరం సంగతి పక్కన పెడితే అసలు బనకచర్ల విషయంలో తెలంగాణకు అభ్యంతరం ఎందుకన్న మౌలిక ప్రశ్న సామాన్యజనానికి వస్తుంది.
ఏపీ అత్యంత దిగువ రాష్ట్రం. పై రాష్ట్రాలు కట్టుకోగలిగినన్ని ప్రాజెక్టులు కట్టుకుంటున్నాయి. ఆపుకోగలగినన్ని నీళ్లు ఆపుకుంటున్నాయి. అనుమతులు ఉన్నాయా లేవా అన్న వాటి గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. కాళేశ్వరం కట్టింది కూడా గోదావరిపైనే. ఆ ప్రాజెక్టు అనుమతుల గురించి మాట్లాడితే చాలా పెద్ద కథ అవుతుంది. అలా ప్రాజెక్టులు కట్టుకునీ నీళ్లు మళ్లించుకున్న తర్వాత దిగువకు వచ్చే నీరు ఏపీ వాడుకుంటోంది. పట్టుకోగలగినన్ని నీళ్లు పట్టుకుని మిగిలినవి సముద్రంలోకి వదిలేస్తోంది. అంత కంటే చేయగలిగిందేమీ లేదు. అవి అలా సముద్రంలోకి పోవాల్సిందే తప్ప.. మరో మార్గం లేదు.
అలా సముద్రంలోకి పోయే నీటిని తరలించుకోవడానికి ఏపీ ప్రభుత్వం బనకచర్ల చేపట్టింది. దాని వల్ల తెలంగాణకు చెందిన జలాలు ఒక్క చుక్క కూడాతీసుకోరు. ఏపీ కంటే తెలంగాణ దిగువన అభ్యంతరం చెప్పవచ్చు. తెలంగాణ నిలబెట్టుకోగలిగినంత నీరు నిలబెట్టుకున్న తర్వాత దిగువకువచ్చి.. సముద్రంలో కలసిపోయే నీటిని మళ్లించుకుంటే అభ్యంతరం ఎందుకు ?. అంటే వృధాగా సముద్రంలోకి అయినా పోవచ్చుకానీ.. ఏపీ వాడుకోకూడదన్నట్లుగా తీరు ఉంది. ఇలాంటి అభ్యంతరాల వల్లనే రెండురాష్ట్రాల మధ్య జలవివాదాలు పెరుగుతాయి. ఏవో టెక్నికల్ కారణాలు చెప్పవచ్చు కానీ.. రియాలిటీ ఆలోచిస్తే .. ఏపీ కి దక్కే నీరు స్వల్పమే. సముద్రంలోకి పోయేదాన్నీ వాడుకోనివ్కపోతే ఎలా ?