రాష్ట్ర విభజనకు పూర్వం వరకు విద్యత్ కోతలతో సతమతమయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తెదేపా అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆ సమస్యను అధిగమించింది. ఇప్పుడు రాష్ట్ర అవసరాలకి సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా మిగులు విద్యుత్ స్థాయికి చేరుకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. తెలంగాణా రాష్ట్రం కూడా క్రమంగా విద్యుత్ సంక్షోభం నుండి బయటపడుతున్నట్లే కనిపిస్తోంది. కానీ తెలంగాణా రాష్ట్రంలో ప్రతిపాదించిన అన్ని విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయ్యేవరకు ఇరుగు పొరుగు రాష్ట్రాల మీద ఆధారపడక తప్పదు.
గతేడాది ఛత్తీస్ ఘడ్-తెలంగాణా రాష్ట్రాల మధ్య 1000 మెగావాట్స్ విద్యుత్ సరఫరాకు ఒప్పందం కుదిరింది.మళ్ళీ నిన్న మరో 1000 మెగావాట్స్ విద్యుత్ సరఫరాకు వాటి మధ్య ఒప్పందం జరిగింది. కానీ రెండు రాష్ట్రాల మధ్య అంత విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమయిన హై-పవర్-ట్రాన్స్ మిషన్ లైన్స్ లేనందున ఇంత వరకు విద్యుత్ సరఫరా కాలేదు. ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ విజ్ఞప్తి మేరకు కేంద్రప్రభుత్వం వార్ధా నుండి డిచ్ పల్లి వరకు 4350 విద్యుత్ మెగావాట్స్ విద్యుత్ సరఫరా సామర్ధ్యంగల హై-పవర్-ట్రాన్స్ మిషన్ లైన్స్ నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు చేయడంతో పనులు మొదలయ్యాయి. అవి పూర్తి కావడానికి మరొక ఏడాది సమయం పట్టవచ్చును.
ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల మధ్య అంతకంటే ఎక్కువే విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమయిన లైన్లు ఉన్నప్పటికీ, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగతంగా, రాజకీయంగా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కారణంగా ఆంధ్రా నుండి విద్యుత్ స్వీకరించేందుకు ఇష్టపడటం లేదు.అందుకే పక్కనే ఉన్న ఆంధ్రాని కాదనుకొని ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి విద్యుత్ కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. అక్కడి నుండి విద్యుత్ సరఫరా అవడానికి ట్రాన్స్ మిషన్ లైన్లు కూడా వేసుకోవలసి వస్తోంది. అయినా కేసీఆర్ దానికే మొగ్గు చూపుతుండటం విశేషం. ఛత్తీస్ ఘర్ నుండి ఈ అదనపు విద్యుత్ సరఫరా అయ్యే వరకు తెలంగాణా రాష్ట్రంలో రైతులకు, పరిశ్రమలకు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఆంధ్రా నుండి తెలంగాణాకి చాలా తక్కువ ఖర్చుతోవిద్యుత్ సరఫరా చేసే అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి, పంతాలకి వ్యక్తిగత ద్వేషాలకి తెలంగాణ ప్రజలు మూల్యం చెల్లించవలసి రావడం దురదృష్టకరం.