గోదావరి జలాలపై తెలంగాణా రాష్ట్రంలో ఐదు బ్యారేజీల నిర్మాణానికి మరియు నదీ జలాలను పంచుకోవడం కోసం తెలంగాణా, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఒప్పంద కుదుర్చుకొన్నాయి. వాటిపై తెలంగాణా, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ ఇవ్వాళ్ళ ముంబైలో సంతకాలు చేసారు. ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణాలో గోదావరి నదిపై ఐదు చోట్ల బ్యారేజిలు నిర్మించుకోవడానికి వీలవుతుంది. తద్వారా సముద్రంలోకి వృధాగా పోతున్న ప్రాణహిత, లోయర్ పెన్ గంగ మరియు ఇంద్రావతి నదుల 4000 టి.ఎం.సి.ల జలాలను తెలంగాణా రాష్ట్రం వినియోగించుకోగలుగుతుంది. దాని వలన తెలంగాణాలో వేలాది ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుటుంది. కొత్తగా అనేక వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ సమస్య అపరిష్కృతంగా ఉంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుండి దీని పరిష్కారం కోసం తెరాస ప్రభుత్వం తరపున బారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చాలా కృషి చేసారు. ఆయన కృషి ఫలితంగానే ఎట్టకేలకు ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం లభించింది. కనుక రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈరోజు కుదిరిన ఒప్పందం చారిత్రిక ఒప్పందం అని చెప్పిన కేసీఆర్ మాటలు నూటికి నూరు శాతం నిజమేనని అంగీకరించవచ్చును. ఈ నదీ జలాల పంపకాలు, బ్యారేజీల నిర్మాణంలో ఎదురయ్యే సమస్యల పరిష్కరించుకోవడానికి రెండు రాష్ట్రాలు కలిసి ఒక కౌన్సిల్ ని ఏర్పాటు చేసుకోబోతున్నాయి.
ఇంతవరకు ఒకే రాష్ట్రంగా కలిసి ఉన్న ఆంద్రా, తెలంగాణా రాష్ట్రాలు నదీ జలాల విషయంలో చాలా గొడవలు పడ్డాయి కానీ పెద్దగా శ్రమపడకుండానే తెలంగాణా ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోగలిగింది. తెదేపా, తెరాసల మధ్య నెలకొని ఉన్న రాజకీయ విభేదాలు, వైషమ్యాల కారణంగానే రెండు తెలుగు ప్రభుత్వాల మధ్య గొడవలకు మూల కారణమని అర్ధం అవుతోంది. కనుక ఇప్పటికయినా ఆ రెండు పార్టీలు తమ రాజకీయ విభేదాలను పక్కను పెట్టి రెండు రాష్ట్రాలలో రైతన్నలకు మేలు చేకూరేవిధంగా నిర్ణయాలు తీసుకొంటే బాగుంటుంది.