తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డి… ఇద్దరూ ప్రగతి భవన్ లో భేటీ కావడం, ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించడం, ముందుగా నీటి వనరుల సద్వియోగంపై మొన్ననే చర్చించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత, రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. గోదావరి నుంచి శ్రీశైలం జలాశయానికి మళ్లించే నీటిని ముందుగా సాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని సీఎం జగన్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. జలాశయం పూర్తిగా నిండిన తరువాతే విద్యుత్ ఉత్పత్తికి నీటిని వాడాలని ప్రతిపాదించారని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారులు నివేదికలు తయారు చేసే పనిలోపడ్డారు.
అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఇంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటే… రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్షాలు పెద్దగా స్పందించడం లేదు. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీపై మాట్లాడేందుకు విపక్షాలు ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదు. జగన్, కేసీఆర్ భేటీలు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి, ఈ సందర్భంలో ఏవైనా సూచనలూ సలహాలూ ఉంటే విపక్షాలు చెయ్యొచ్చు, చెయ్యాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. కేవలం విమర్శించాల్సిన పనే లేదు. గోదావరి జలాలను అదనంగా శ్రీశైలానికి తరలిస్తే, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలకు అదనంగా కొన్ని నీళ్లు ఇవ్వాలనే నిబంధన ఉంది. దానిపై మాట్లాడొచ్చు. కేంద్రంలోని భాజపా సర్కారు కావేరీ-గోదావరి నదుల అనుసంధానం కోసం గత ప్రభుత్వ హయాంలోనే కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఈ సందర్భంగా కృష్ణ, గోదారి నీళ్లపై తెలుగు రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాలపై కేంద్రం ప్రభావం ఉంటుందా లేదా అనేది చర్చించొచ్చు. సాంకేతికంగా ఇలాంటి అంశాలు కొన్ని ఉన్నాయి.
అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అంతర్గత సంక్షోభంలో ఉంది. పార్టీ నుంచి నేతల వలసలు ఒక పక్క, రాహుల్ గాంధీ సంక్షోభం మరోపక్క. కాబట్టి, రాష్ట్ర వ్యవహారాలు పట్టించుకునే పరిస్థితిలో ఆ పార్టీ నేతలు లేరు. తెలంగాణలో భాజపా… ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బిజీబిజీగా ఉంది. కాబట్టి, వారికీ ముఖ్యమంత్రుల వ్యవహారం అక్కర్లేనిదైపోయింది. ఆంధ్రాలో చూస్తే… టీడీపీ ఇంకా ఎన్నికల్లో ఓటమి విశ్లేషణతోనే మునిగి తేలుతోంది. మరోపక్క, కీలక నేతల వలసలు కూడా ఉన్నాయి. ఆంధ్రాలో భాజపాని ప్రతిపక్ష పార్టీ అనలేంగానీ, వారు కూడా టీడీపీ నుంచి నేతల్ని ఆకర్షించే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఏతావాతా రెండు రాష్ట్రాల్లో విపక్షాలన్నీ సొంత పనులతో బిజీబిజీగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల ప్రజలకు సంబంధించిన కీలకమైన అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించుకుంటూ ఉంటే, స్పందించే టైం వాళ్లకి లేకుండా పోతోంది!