వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పై కొన్ని వెసులుబాట్లు కావాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట్నుంచీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై పన్ను మినహాయింపు ఇవ్వాలనీ, దీంతోపాటు మరికొన్ని ఉత్పత్తులపై పన్ను భారం తగ్గించాలని పట్టుబడుతోంది. ఒక దశలో, అవసరం అనుకుంటే దీనిపై న్యాయ పోరాటానికైనా సిద్ధం అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే, శనివారం నాడు హైదరాబాద్ లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. కొనసాగుతున్న ప్రాజెక్టులపై పన్ను భారం తగ్గించడంతోపాటు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, బీడీలు, గ్రానైట్ వంటివాటిపై కూడా భారం తగ్గించాలనే డిమాండ్లను కౌన్సిల్ ముందు ఉంచేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమౌతోంది.
ఇదే విషయమై మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… జీఎస్టీ వల్ల ప్రస్తుతం చేపడుతున్న ప్రాజెక్టులపై చాలా ప్రభావం పడుతోందన్నారు. దీని వల్ల ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలకు విఘాతం కలిగే ఆస్కారం ఉందన్నారు. చాలా గందరగోళ వాతావరనం నెలకొనడం వల్ల పనులు మధ్యలోనే నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. అందుకే, వాటిపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నామన్నారు. ఒకవేళ అలా రద్దు చేయలేని పక్షంలో కనీసం 5 శాతం స్లాబ్ లో పెట్టాలనీ, దాంతోపాటు ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ సర్దుబాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు ఈటెల చెప్పారు. రంగాలవారీగా జీఎస్టీ వల్ల ప్రభుత్వంపై పడుతున్న భారమంతా లెక్కలు తీశామనీ, దాన్ని ఈ సమావేశంలో అందించబోతున్నామన్నారు. జీఎస్టీ సవరింపులపై ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఇప్పటికే కేంద్రాని ఒక లేఖ రాశారు. నీటిపారుదల ప్రాజెక్టులను 5 శాతం పన్ను పరిధిలోకి తీసుకుని రావాలని ఆ లేఖలో ప్రధానంగా కోరారు. గిరిజన ఉత్పత్తులు, మత్స్యకారులకు అవసరమైన వస్తువులపై పన్ను భారం లేకుండా చేయాలని యనమల పేర్కొన్నారు.
మొత్తానికి, ఇన్నాళ్లకు ఒక బలమైన అంశంతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తెలుగు రాష్ట్రాలు ఒకటి కావడం విశేషమే. ఇప్పటికే, రెండు రాష్ట్రాల ఆర్థికమంత్రులు ఒకసారి భేటీ అయ్యారు. తాజా సమావేశంలో కలిసికట్టుగానే తమ వాణిని వినిపించేందుకు ఇద్దరూ సిద్ధమౌతున్నారు. ఈ ప్రభావం కేంద్రంపై ఎలా ఉంటుందనేదే చూడాలి. జీఎస్టీ మినహాయింపులపై మొదట్నుంచీ కేసీఆర్ సర్కారు కాస్త దూకుడుగానే ఉంది. కానీ, ఏపీ సర్కారు ఆచితూచి మాట్లాడుతూ వస్తోంది. ఒకే దేశం ఒకే పన్ను అనే మోడీ నినాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొంత వినిపించినా, ఇప్పుడు సవరణ విషయంలో మాత్రం రాజీ పడకుండా ప్రయత్నిస్తున్నారనే చెప్పొచ్చు. కావాల్సిన మినహాయింపులపై తమవంతు ప్రయత్నం తాము సాగించి సాధించుకుంటామనే యనమల కూడా అంటున్నారు. రెండు రాష్ట్రాలూ ఉమ్మడిగా చేస్తున్న ఈ డిమాండ్లపై కేంద్రం స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.